ఏ సెంటిమెంట్ చూసి తెలంగాణ ఇచ్చారు?.. బాబు

బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపేసిన చందంగా రాష్ట్ర విభజన ఉందని ఆనాడు మోదీ అన్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. సెంటిమెంట్లను చూసి డబ్బులు ఇవ్వటం కుదరదని అన్నవారు ఏ సెంటిమెంట్‌ను చూసి తెలంగాణ ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, సాయంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సెంటిమెంట్లను చూసి డబ్బులు ఇవ్వటం కుదరదని అనడంపై బాబు స్పందించారు. దక్షిణ భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా సమానంగా ఎదిగేందుకు సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. బీహార్, యూపీ మాదిరి ఏపీ కూడా ఎప్పటికీ దరిద్రంలోనే మగ్గిపోవాలా ? అని ప్రశ్నించారు.

‘కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించిన అన్ని వివరాలను చెప్పాం. సాయం చేస్తే ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలోకి నడిపిస్తాం. ఏపీకి ఎలాగైనా సాయం చేస్తానన్న ప్రభుత్వం ఇప్పుడిలా మాట మార్చటం అస్సలు బాగాలేదు. మాటిచ్చినవారు అధికారంలోనే వున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దు ’ అన్నారు చంద్రబాబు.