శవాన్నీ తేలేని ప్రభుత్వాలు.. వాట్సాప్‌లో ఇల్లాలి కడచూపు.. - MicTv.in - Telugu News
mictv telugu

శవాన్నీ తేలేని ప్రభుత్వాలు.. వాట్సాప్‌లో ఇల్లాలి కడచూపు..

October 23, 2018

అధికారుల తోలుమందానికి పరాకాష్ట ఇది. అత్యంత దయనీయ స్థితిలో వున్న ప్రజలను అక్కున చేర్చుకోవాల్సిన అధికారులు పట్టనట్టు కూర్చుంటే పాపం వాళ్ళు చేసేదేముంటుంది ? తమ ఖర్మకు అధికారులను ఎందుకు బాధ్యులను చెయ్యాలని బాధపడతారు. అంతేగానీ ఎవ్వర్నీ నిందించరు. మానవత్వానికి మచ్చగా, అధికారుల దురహంకారానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ ఘటన. మొన్న పంజాబ్లోని అమృత్సర్లో దసరా వేడుకల్లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం  నిండు జీవితాలను బలితీసుకుంది.రావణ దహన సమయంలో పట్టాల మీదున్న జనాల మీదకు రైలు దూసుకెళ్ళి, దాదాపు 62 మంది ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయినవారిలో బిహార్కు చెందిన రాజేశ్ భగత్ అనే వలసకూలీ ఉన్నాడు. రాజేశ్ది పేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడదు. అతనికి భార్యా ఇద్దరు పిల్లలున్నారు. భార్య గర్భవతి కూడా. అతని అకాల మరణంతో ఆ కుటుంబ భారం ఇప్పుడు భార్యపై పడింది. రాజేశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి రూ.45,000 అవుతుందని అధికారులు తెలిపారు. అంత మొత్తం కట్టలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోలేదు ఆమెకు. చివరికి  వాట్సాప్ ద్వారా తన భర్తకు తుది వీడ్కోలు చెప్పింది. ఘనత వహించిన  బీహార్, పంజాబ్ ప్రభుత్వాలు తనపై దయ చూపించలేకపోయాయి.

తన భర్తను కడసారి చూసుకునే భాగ్యాన్ని కూడా కల్పించలేకపోయాయని పొగిలిపొగిలి ఏడ్చిందామె. తన పిల్లలను పోషించడానికైనా ఏదన్నా దారి చూపండంటూ అధికారులను వేడుకుంటోంది. ప్రభుత్వాలకు, అధికారులకు దయ, కరుణ లేకపోతేనేం మాకు ఉంది అంటూ గ్రామస్థులు ముందుకొచ్చారు. ఆమెకు ఆర్థికంగా కొంత మొత్తాన్ని సాయం చేస్తామని మాటిచ్చారు.