ఇన్నాళ్లెక్కడున్నాడో… ఇప్పుడు లేచాడీయన

తెలంగాణ వాళ్లకు తెలివి నేర్పింది తామే అంటారు ఒకాయన. ఐటి స్పెల్లింగ్ కూడా తెలియకపోతే  మా చంద్రబాబు నాయుడే నేర్పారని చెప్తారో ఇంకొకాయన. అస్సలు మీకు తెలివి నేర్పిందే తామంటే తామని సీమాంధ్ర నాయకులు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో అయిన  చిత్రాలెన్నో ప్రజలు గమనించారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వంతు అయిపోయింది. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెరపైకి వచ్చారు. రాజాకార్ల నుండి తెలంగాణను కాపాడింది తామే అని ఈయన చెప్పుకుంటున్నారు.

మీరు పుట్టిందే తెలంగాణ వాళ్లకు అన్నీ నేర్పడానికని ఆక్కడి  ప్రజలు అనుకునేలా ఉంది వీరి వ్యవహారం. తెలంగాణ ప్రజలకు ఎవరు ఏం నేర్పారు. ఏం చెప్పారు. ఎందుకు  చెప్పారు. ఈ విషయాలన్నీ చరిత్రలో ఉన్నాయి.

తెలంగాణపై మరోసారి రాజకీయ ఆధిపత్యాన్ని సాధించేందుకు సీమాంధ్ర నాయకులు వేస్తున్న ఎత్తులు. తెలంగాణ తమ చేతిలో నుండి జారి పోయిందనే బాధ ఇంకా వారికి పోనట్లే ఉంది. రాజకీయంగా ఎవరి పార్టీలు వారివి, ఎవరి ప్రచారాలు వారివి. కానీ  అన్నీ మేమే చెప్పాం అనే మాట ఆధిపత్య ధోరణికి, అహాంకారానికి నిదర్శనమని తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఎన్నో మార్లు ఉద్యమకారులు చెప్పారు. అయినా వీరి ఆలోచనలు మారడం లేదు.Telugu news Where is he now? He got up now.. సినిమా డైలాగులు రాసి ఇస్తే చెప్పే బాలకృష్ణ కూడా తెలంగాణ వారికి ఐటి స్పెల్లింగులు నేర్పామని అంటున్నారు. తన రాష్ట్ర రాజకీయాలను వదలి పక్క రాష్ట్ర రాజకీయాల్లో మునిగి  తేలుతున్న చంద్రబాబునాయుడు ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానే అని చెప్పుకుంటున్నారు.

ఆర్డీఎస్ నీళ్ల  విషయంలోనే అలంపూర్, గద్వాలకు అన్యాయం  జరిగింది వాస్తవం కాదా. ఇక్కడ భూములపై పెత్తనం సాధించింది మీరు  కాదా? ఇక్కడి రాజకీయాలపై పట్టు సాధించి గుత్తాధిపత్యం చేసింది సీమాంద్ర నాయకులు కాదా? వీటికి  సమాధానాలు చెప్పాలి.

తెలంగాణ వారిని బతికించింది.. తెలంగాణ వారికి అన్నీ  నేర్పించింది తామంటే తామని చెప్పుకుంటున్నారు. తెలంగాణ వారి గురించి మీకెందుకు… మీ రాష్ట్రంలో మీ ప్రజల గురించి ఆలోచనలు చేయండి. వారికి నేర్పేది ఏమైన   ఉంటే వారికి నేర్పండి. నేర్పించాల్సిన అర్థాలు, నిర్వచనాలు ఏవైనా ఉంటే అవి నేర్పండి.

సైబరాబాద్ కట్టారు.. ఆధునిక తెలంగాణను సృష్టించారు కదా. మరి అమరావతిని దాని  కంటే మంచిగా కట్టండి. చరిత్రలో నిలిచి పోండి. అంతే కాదు పదే పదే అన్నీ మేమే చేశామని చెప్పడం దారుణం, ఘోరం. తెలంగాణ ప్రజలను మళ్లీ మళ్లీ అవమానించడమే అవుతుంది తప్ప మరోటి కాదు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటివారు కూడా  తెలంగాణ ప్రజలను కాపాడింది తామేనని చెప్పుకుంటున్నారు.  చాలా రోజుల తర్వాత ఈయన ఊడిపడ్డాడు. ఇన్నాళ్లు ఎక్కడున్నారో. ఏం చేశారో. తెలంగాణ తాము  చేసి మేలు గురించి ఠక్కున గుర్తుకొచ్చినట్లుంది. కరువు సీమ రాయలసీమ గురించి ముందుగా ఆలోచన చేసుకోండి సారు.  తెలంగాణకు జరిగే నష్టం గురించి వందల యేండ్లుగా తెలంగాణ ప్రజలు ఏం చేయాలో అది చేసుకున్నారు. చేసుకుంటారు. వారి సంగతి వారు చూసుకుంటారు. ముందు మీ సంగతి చూసుకోండని తెలంగాణ ప్రజలు  చేస్తున్న సూచన.