గాంధీ విగ్రహాలు మన దగ్గర ఎందుకు.. తీసేద్దాం - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీ విగ్రహాలు మన దగ్గర ఎందుకు.. తీసేద్దాం

April 7, 2018

‘ గాంధీ మనకు వ్యతిరేకి.. ఆయన విగ్రహాలు మన దగ్గర ఎందుకు ? తీసేద్దాం ’ అంటూ భారత జాతిపిత మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా కెనడాలో ఉద్యమం మొదలైంది. కెనడా రాజధాని అట్టావాలోని కర్లెటోన్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు ధర్నాలు చేపట్టారు. యూనివర్సిటీలో తొలుత చర్చా కార్యక్రమం జరిగింది. ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలంటూ కొందరు నల్ల జాతీయ విద్యార్థులు ప్రతిపాదన చేశారు.‘గాంధీ నల్లజాతి వ్యతిరేకి. స్వార్థ ప్రయోజనాలకే గాంధీ నల్ల జాతి ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. బ్రిటిష్‌ వాళ్లను బెదిరించటానికే ఉద్యమాన్ని ఓ ఆయుధంగా వాడుకున్నారు.

దక్షిణాఫ్రికాలో అణచివేతకు గురవుతున్న భారతీయులను రక్షించుకునేందుకే గాంధీ అలా చేశారు.  అలాంటి వ్యక్తిని మనం ఇంతలా గౌరవించాల్సిన అవసరం ఏముంది? ఆఫ్రికాలో ఆయన వివక్షత ఎదుర్కున్నాడని.. అందుకే ఉద్యమం చేపట్టాడని కథలు చెబుతుంటారు. కానీ, అదంతా అబద్ధం ’ అని కెన్నెత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ స్టూడెంట్‌ అసోషియేషన్‌(IASSA) అధ్యక్షుడు కెన్నెత్‌ అలియూ అన్నాడు.

యూనివర్సిటీ పరిపాలన విభాగం మాత్రం విగ్రహ తొలగింపు డిమాండ్‌కు విముఖత వ్యక్తం చేసింది. యూనివర్సిటీ మద్దతు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది.