mictv telugu

ఇంతకు బాబు హోదా సాధిస్తారా….

February 13, 2019

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ఆందోళన ఆయన మైలేజ్ పెంచిందా. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందా అనేదానిపైనే చర్చ జరుగుతోంది. వారం రోజుల నుంచి హోదాకు సంబంధించిన అంశంపై చంద్రబాబు అటు ఎపీలోనూ ఇటు హస్తినలోనూ  ఆందోళనలు చేస్తున్నారు. మోదీ సభ తర్వాత చంద్రబాబు విమర్శల ఘాటు పెంచారు. ఏపీకి హోదా ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందనే అంశాన్ని ఏపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కాకపోతే ఏపీ ప్రజల బలమైన సెంటిమెంట్‌గా మారిన హోదా విషయంలో  ముందు నుంచీ చంద్రబాబు ఇంత పెద్ద స్థాయిలో స్పందించలేదు. కొన్నసార్లు ప్యాకేజీ చాలు అని అన్నారు. మరికొన్ని సార్లు పెద్ద  ఎత్తున రాయితీలూ చాలు అన్నారు.

ఇప్పుడు  ప్రత్యేక హోదా తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. ఏపీ  విపక్ష పార్టీలూ హోదా విషయం గురించే మాట్లాడుతున్నాయి. చంద్రబాబు చేస్తున్న ఆందోళనకు  కొన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. చంద్రబాబుతో పాటు ఢిల్లీలో ఆందోళనలో పాల్గొన్నాయి.

Telugu news Will you take the status of Chandra Babu .....

ఢిల్లీలో  ఒక రోజు దీక్ష, మరో రోజు ర్యాలీ ఈ రెండూ కూడా జాతీయ మీడియాలోనూ  బాగానే ప్రచారం వచ్చింది. తెలుగు మీడియా బాగానే రాసింది. రెండు రోజుల పాటు అక్కడే ఉండి తన మిత్ర పార్టీలను కలుపుకుని  తన తపన ఎమిటో చూపించుకునే ప్రయత్నం చేశారు. మోదీని వ్యతిరేకిస్తున్న దాదాపు అన్ని పార్టీలనూ చంద్రబాబు నాయుడు తన వద్దుకు రప్పించుకోవడంలో  విజయం సాధించారు. కాకపోతే తన భవిష్యత్తు కార్యాచరణ గురించిన స్పష్టతను, ఏపీ ప్రజలు ముందు ముందు చేయాల్సింది ఏమిటో స్పష్టంగా చెప్పలేక పోయారు.

ఏపీకి హోదా కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని అన్నారు. అది ఏమిటో కూడా చెప్పలేదు. ఇదంతా మోదీని విమర్శ చేయడానికే అన్న చందంగా కన్పించింది.

ఏపీకి హోదా కోసం ఆ రాష్ట్రానికి చెందిన విపక్ష పార్టీలు జనసేన, వైసీపీలు రెండూ రెండు మార్గాల్లో వెళ్తున్నాయి.  వాటి మైలేజ్ కోసం అవి పాకులాడుతున్నాయి. చంద్రబాబునాయుడు తనతో కలిసి రావాలని వారిని కోరారు. పలుమార్లు మాట మార్చిన మీతో ఎలా వచ్చేదన్నట్లుగా  జనసేన నాయకులు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక వైసీపీని, మోదీని కలిపి మాట్లాడారు బాబు. రాబోయే రోజుల్లో వారు కలిసి పోటీ చేస్తారా అని, జగన్‌ను మోదీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారని అన్నారు. ఇవీ  ప్రజల దృష్టికి వెళ్లి వారికి వ్యతిరేకంగా పనిచేస్తాయని బాబు ఉద్దేశ్యం కావొచ్చు. కానీ అలా ఎంత మేరకు జరుగుతుందనేది పెద్ద ప్రశ్ననే.

తాము కూడా హోదా గురించి మాట్లాడామని, ఆందోళనలు చేశామని వైసీపీ నాయకులు అంటున్నారు. అంతేకాదు చంద్రబాబు డ్రామాలాడుతున్నారనేది వారి వాదన. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టగలిగిన బాబు ఏపీ ప్రజల మద్దతు  ఎంత మేరకు కూడగట్టుకుంటారనేది ముందు ముందు తెలుస్తుంది.

మోదీని టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు చేస్తున్న విమర్శలు కొంత మేరకు పనిచేసే అవకాశం ఉంది. దీని వల్ల హోదా వస్తుందా అంటే చెప్పలేం. బాబు అండ్ కో అనుకున్న విజయం సాధించాయా అంటే దానికి సమాధానం వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్లు, సీట్ల సంఖ్యపైనే ఆధారపడి ఉంటుంది.Telugu news Will you take the status of Chandra Babu ….