మా చెల్లి మృతికి కారణమెవరో చెప్పండి ప్లీజ్.. ఓ అన్న - MicTv.in - Telugu News
mictv telugu

మా చెల్లి మృతికి కారణమెవరో చెప్పండి ప్లీజ్.. ఓ అన్న

January 9, 2019

స్కూటీలో కాలేజీ వెళుతున్న చెల్లిని గుర్తుతెలియని వాహనం గుద్దడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదానికి సంబంధించి సరైన సాక్ష్యాలు లభించకపోవడంతో పోలీసులు సైతం చేతులు ఎత్తేశారు. అయితే ఆమె అన్నయ్య మాత్రం పట్టు వీడలేదు. పోలీసులు సహాయం చేయకపోయినా సరే తన చెల్లిని చంపిన హంతకులను పట్టుకోవడం కోసం ప్లకార్డులు, కర పత్రాలతో పోరాటం మొదలుపెట్టాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన కనక్ గోయల్(21) ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతోంది.

ఈ క్రమంలో ముకర్బా చౌక్ వద్ద ఈ నెల 2న ఓ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో పడిపోయి చాలాసేపు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన బాధితురాలు చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఢిల్లీ పోలీసులు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో విచారణలో ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో సోదరుడు మయాంక్ (25) రంగంలోకి దిగాడు. చెల్లెలి ఫొటో, ప్రమాదానికి గురైన వాహనం, హెల్మెట్ ఫొటోలతో మయాంక్ కరపత్రాలు, ప్లకార్డులు తయారు చేయించాడు. వీటిని ప్రయాణికులకు, పాదచారులకు పంచుతూ… తన చెల్లి హంతకుల వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రతీ ఒక్కరిని కోరుతున్నాడు. ఈ విషయమై మయాంక్ స్పందిస్తూ.. తన సోదరిని ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. తన చెల్లి హంతకులను పట్టుకుని తీరుతానని మయాంక్ స్పష్టం చేశాడు.Telugu News With placards, youth hunts for sister’s ‘killer’