ఇదేం ఊరురాబాబూ… మహిళలు నైటీ ధరిస్తే రూ.2వేలు ఫైన్… - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం ఊరురాబాబూ… మహిళలు నైటీ ధరిస్తే రూ.2వేలు ఫైన్…

November 9, 2018

మహిళల మీద అజమాయిశీ, అధికారాలు, ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి కొన్ని గ్రామాల్లో. మహిళలు కూడా ఎందులోనూ తక్కువ కాదని కొందరు పురుష పుంగవులు ఎప్పుడు తెలుసుకుంటారో. రకరకాల పైత్యాలన్నీ వారి మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించరా ? కట్టుబాట్లు, ఆచారాలు అంటూ మహిళలను మానసికంగా, భౌతికంగా హింసిస్తున్న అహంకార పురుషులు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు ? తమ మీద కూడా అన్నన్ని ఆంక్షలు, హద్దులుంటే అసలు వారు భరించగలరా ? ఆ వూళ్లో పగలు నైటీ వేసుకుంటే ఫైటే జరుగుతుంది. వారు పెట్టిన రూల్స్ ఎవరైనా అతిక్రమిస్తే ఫైను వేస్తున్నారు. లేదంటే వెలేసినా వెలేస్తారు. నాగరికంగా ప్రపంచం పరుగులు తీస్తుంటే ఈ గ్రామం మాత్రం అనాగరికంగా ఇంకా ఇంకా పాతాళంలోకి కూరుకుపోతున్నట్టే వుంది. ఇంతకీ ఆ వూరు ఏదంటే… పశ్చిమ గోదావరి జిల్లా నదంమర్రు మండలం, తోకలపల్లి గ్రామం అది.Telugu news Women wearing nighty 2 thousand fine … West godavari, Tokalapalli villageఆ గ్రామంలో మహిళలు స్వేచ్ఛగా వుంటే ఓర్వలేరు. అక్కడ పగటిపూట మహిళలు నైటీలు వేసుకోవద్దని ఊరిపెద్దలు ఆంక్షలు విధించారు. ధరించిన వారికి రూ.2 వేలు జరిమాన కూడా విధించారు. అంతేకాదు ఈ నియమాన్ని అందరూ ఫాలో అవుతున్నారో లేదో చూడటానికి ఓ 9మంది సభ్యులను కూడా నియమించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకే మహిళలు నైటీలు ధరించాలి అని గ్రామ కమిటీ పెద్ద మనుషులు నిర్ణయించారు. మైక్‌తో ఊరంతా ప్రచారం కూడా చేయించారు. ఊరికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కమిటీ సభ్యులే నిర్ణయిస్తారు. ఇందులో సర్పంచ్  పాత్ర ఏమీ వుండదు. సంవత్సరానికొకసారి ఈ కమిటీ మారుతుంటుంది. కొత్త కొత్త నిర్ణయాలు ప్రవేశ పెడుతుంది ఈ కమిటీ. ఈ ఆచారం అక్కడ చాలా ఏళ్ళుగా కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఆంక్షల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు పేర్కొన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు గ్రామానికి వచ్చి పలువురు మహిళలను ఆరా తీశారు. వివరాలు సేకరించారు.

ఎప్పటినుంచో ఈ కట్టుబాట్లు వున్నాయని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదని అంటున్నారు. కొందరు మహిళలు కమిటీ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ముందుకు రావటంలేదు.

కొందరు గ్రామస్తులు తమ రక్షణ కోసమే ఇలాంటి ఆంక్షలు ఏర్పాటు చేసుకున్నామని అంటున్నారు. ఈ విషయంపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా సమంజసం కాని ఆంక్ష. ఇది పూర్తిగా మహిళల హక్కులను కాలరాయడమే అని అన్నారు. ఈ ఆంక్షలు విధించిన పెద్దల మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వెంటనే వాళ్ళు ఈ ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని తెలిపారు.