ప్రపంచలంలోనే చౌకైన 5వ నగరం బెంగళూరు... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచలంలోనే చౌకైన 5వ నగరం బెంగళూరు…

March 16, 2018

ప్రపంచంలోనే నివాసానికి అత్యంత చౌకగా ఉన్న పది నగరాల్లో బెంగళూరు ఐదవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చెన్నై 8వ , ఢిల్లీ 10వ స్థానల్లో  ఉన్నాయని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ (ఈఐయూ) సంస్థ తన నివేదికలో తెలిపింది. మెదటి స్థానంలో సిరియా రాజధాని డెమాస్కెస్, రెండోస్థానంలో వెనెజులా రాజధాని కారకాస్, మూడో స్థానంలో కజకిస్థాన్ ఆల్‌మటి,  నాలుగో స్థానంలో లాగోస్ , 6వ స్థానంలో కరాచీ ,7వ స్థానంలో ఆల్‌గీర్స్ , 9వ స్థానంలో బుచారెస్ట్ ఉన్నాయి. అత్యంత ధనిక నగరంగా సింగపూర్ ముచ్చటగా ఐదోసారి నిలిచింది. ‘ప్రపంచవ్యాప్త జీవన వ్యయం 2018 సర్వే’ను సంస్థ విడుదల చేసింది. దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌, పాకిస్తాన్‌లలో ‘ఖర్చు పెట్టే ప్రతి పైసాకు తగిన విలువ లభిస్తుంది’ అని వివరించింది.‘భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఉంది. అయితే తలసరి ఆదాయం పరంగా చూసినా ,వేతనాలు, ఖర్చులో వృద్ది తక్కువ ఉంది. వేతన వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకుంటే ,తక్కువ వేతనాలే ప్రమాణంగా ఉంటున్నాయి.

ఇందువల్ల కుటుంబాల వ్యయం పరిమితంగా ఉంటోంది. రిటైల్‌ ఉత్పత్తులు కూడా అన్నీ శ్రేణుల్లో లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి  చౌక ఉత్పత్తులు భారీగా నగరాలకు తరలి వస్తున్నాయి. ఇందువల్ల సరఫరా వ్యవస్థల పరిమాణం తక్కువగానే ఉంటోంది. కొన్ని ఉత్పత్తులపై ప్రభుత్వ రాయితీ వల్ల వాటి ధరలు తక్కువగా ఉంటున్నాయి’ అని నివేదిక తెలిపింది.

ఆహారం, నీరు, దుస్తులు, వ్యక్తిగత-గృహ సంరక్షణ ఉత్పత్తులు, ఇళ్ల అద్దెలు, రవాణా, వినియోగ బిల్లులు, ప్రైవేటు పాఠశాలలు, ఇంటి సహాయకులు (పనిమనుషులు), వినోద వ్యయాల వంటి 160 రకాల ఉత్పత్తులు, సేవలను 400 ప్రాంతాల్లో పరిశీలించి, ఈ నివేదిక రూపొందించారు.