మేము ఊరుకునే కొద్ది మీరు రెచ్చిపోతూ వుంటారా ? - MicTv.in - Telugu News
mictv telugu

మేము ఊరుకునే కొద్ది మీరు రెచ్చిపోతూ వుంటారా ?

March 28, 2018

తెలుగు సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జర్నలిస్టులపై  ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ సీరియస్ అయింది. ఇటీవల ఓ టీవీ చానల్‌ డిబేట్ కార్యక్రమంలో ఓ న్యూస్ ప్రెజెంటర్ సినిమా ఇండస్ట్రీలోని తారలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ‘మా’ సభ్యులు మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘ నాకు చిన్నప్పటినుంచి మీడియావాళ్ళు తెలుసు. వాళ్ళంటే నాకు చాలా గౌరవం వుంది. కానీ మా సినిమా వాళ్ళ గురించి చాలా నీచంగా రాసేస్తున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ప్రెస్‌క్లబ్ వారిని నేను అడుగుతున్నాను… మీలో ఒక జర్నలిస్ట్  మా గురించి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటే మీరెందుకు మౌనంగా వున్నారు? మిమ్మల్ని ఒక్క మాట అంటే మొత్తం ఒక్కటైపోతారు, తప్పో ఒప్పో ఆలోచించరు…. మా గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్లారు. మీరు అలా మాట్లాడుతుంటే మేము ఎందుకు ఊరుకోవాలి?మేము ఊరుకునేకొద్దీ మీరు రెచ్చిపోతూ ఉంటారా? క్లిక్కుల కోసం ఐదు పైసలు, పది పైసల కోసం మా బతుకులను బజారుకీడుస్తున్నారు. ఇలా ఎంతకాలం సహించాలి ? మా గురించి కాకుండా మీ ఇంట్లో వాళ్ళ గురించి రాయండి చూద్దాం. మనం చాలా గర్వంగా మా వూరు, మా ప్రదేశం అని చెన్నై నుండి వచ్చింది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి కాదు. ఎప్పుడూ ఇలా జరుగలేదు. ఇలా జరుగడం ఎప్పుడూ చూడలేదు ’ అని మండిపడ్డారు మంచులక్ష్మి.

దాసరి నారాయణరావు అంకుల్ ఉండి ఉంటే ఈ రోజు మేము ఇలా మీటింగ్ పెట్టేవారం కాదని.. ఏం న్యాయం జరుగాలో ఆల్రెడీ జరిగిపోయి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ మేమేదో మా బతుకుదెరువుకోసం సినిమాలు చేసుకుంటున్నాం. మావల్ల రోజూ రెండు మూడ వందల మంది బతుకుతున్నారు. అలాంటి మమ్మల్ని తప్పు చేస్తే నిలదీసే హక్కు ఉంది. కానీ ఏమీ చేయకున్నా నీచంగా రాసే హక్కు మీకు లేదు ’ అని మంచులక్ష్మి అన్నారు.