యోగి ఆకులు తింటే, మేం అలములు తిన్నాం.. - MicTv.in - Telugu News
mictv telugu

యోగి ఆకులు తింటే, మేం అలములు తిన్నాం..

December 15, 2017

‘తాను తినడు.. ఇంకొకరిని తిననివ్వడు’ అన్నట్టుగానే వున్నది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యవహారం! ఆయన శాకాహార అలవాటు యూపీ మాంసాహారులైన ఐఏఎస్‌లను ఇరకాటంలో పెట్టింది. గత సీఎం మీటింగ్‌లానే ఈ సీఎం మీటింగ్‌లో మటన్, చికెన్, చేపల కూర ఉంటాయనుకున్నారు. కానీ వారి ఆశ అత్యాశగానే మిగిలిపోయింది.

ప్రతి ఏడాది ఇండియన్‌ అడ్మినిస్టేటివ్‌ సర్వీస్‌ అధికారుల వారాంతపు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమం మాంచి మాంసాహార విందుతో ముగుస్తుంది. అయితే, ఆదిత్యనాథ్‌ ఈసారి కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో వారి మెనూలో  నాన్‌‌వెజ్‌‌ను పూర్తిగా తీసిపారేశారు.  పన్నీర్‌ టిక్కా, ప్రైడ్‌ రైస్‌, హాండీ పన్నీర్‌, గులాబ్‌ జామున్‌, గజర్‌కా హల్వా వంటి వెజ్ వంటకాలతో సరిపెట్టారు.  పూర్తి శాకాహార వంటకాలను చూసి అధికారులందరూ మొహాలు చిన్నబుచ్చుకున్నారు.

‘గురువారం ఈ సమావేశాలు ప్రారంభం కాగా తొలి రోజు మేం శాకాహారంతోనే ముగించేశాం.. ఆయన ఆకులు తింటే మేం అలములు తినేసి ముగించాం..’  అంటూ వారు కొంతమంది మీడియా ప్రతినిధులకు తెలిపారు. ముఖ్యమంత్రిగారి తీరుతో వారంతా గత ముఖ్యమంత్రులను గుర్తు చేసుకుంటున్నారు. మాయావతి హయాన్ని మినహాయిస్తే అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన సమావేశాల్లో  నాన్‌‌వెజ్‌ వంటకాలతో సమావేశం ఘుమఘుమలాడిపోవడమే కాదు.. ఆటలు పాటలు జరిగేవని గుర్తు చేసుకున్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ కూడా జరగ్గా దాన్ని జాతీయ మీడియా కూడా కవర్‌ చేసిందని తెలిపారు.