Home > Analysis > జగన్.. పాదయాత్రకు ముందు, తర్వాత

జగన్.. పాదయాత్రకు ముందు, తర్వాత

యాత్ర.. ఒక నడక మాత్రమే కాదు. ఒక చరిత్ర కూడా. యాత్రలు దేశ చరిత్రలను మార్చాయి. దండయాత్రలు, జైత్రయాత్రల సంగతి కాదు. జనం మధ్య, జనం కోసం సాగే యాత్రలు అవి. దండి ఉప్పు సత్యాగ్రహయాత్ర భారత స్వాతంత్ర్యదీప్తిని ఇనుమడించింది. చైనాలో మావో సారథ్యంలో కదం తొక్కిన లాంగ్ మార్చ్ ఆ దేశ స్థితిగతులను పూర్తిగా మార్చేసి అగ్రరాజ్యాల సరసన నిలెబెట్టింది.

గాంధీ స్ఫూర్తితో మనదేశంలో చాలా యాత్రలు సాగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ చైతన్యరథ యాత్రతో జనయాత్రలు మొదలయ్యాయి. కొన్ని జావగారిపోయాయి. కొన్ని సినిమా ఫక్కీలో సాగాయి. మతం కోసం చేసినవి మతాన్ని దాటి రాలేకపోయాయి. సమీప గతంలో వైఎస్సార్ సాగించిన పాదయాత్రకు మాత్రం ప్రత్యేకత ఉంది. అది ఆయనను అధికార పీఠానికి చేరువచేసింది. జనానికి, ముఖ్యంగా రైతన్నకు భరోసా ఇచ్చింది. ఆయన తనయుడు వైఎస్ జగన మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర రేపటితో ఇచ్ఛాపురంలో ముగియనుంది.

సంకల్ప యాత్రతో తాను ప్రజలకు మరింత చేరువయ్యానని, చాలా విషయాలు తెలుసుకున్నానని జగన్ ఉట్టిపడే విధేయతతో అంటున్నారు. మరి జగన్ యాత్ర కూడా ఆయనకు అధికారం కట్టబెడుతుందా? యాత్రకు ముందు, యాత్ర తర్వాత ఆయన ఇమేజ్‌లో వచ్చిన మార్పేంటి? ప్రజలకు ఆయనను తమ నాయకుడిగా స్వీకరిస్తున్నారా? జగన్ అంటే తండ్రిచాటు బిడ్డ, స్వార్థపరుడు అనే ఒకప్పటి జనాభిప్రాయాన్ని ఆయన మార్చేశారా? తాను ఒక సంపూర్ణ ప్రజానాయకుడినని ప్రజలకు విశ్వాసం కలిగించగలిరా? యాత్ర తర్వాత కూడా ఆయన గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడతారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే యత్నమిది?

ఆవేశం నుంచి ఆలోచన దాకా..

-

వైఎస్సార్ అకాల మరణం తర్వాత జగన్ ఒక్కసారిగా రాజకీయాల్లో వచ్చేశారు. అనుభవం లేకున్నా, సీఎం పదవి కోసం మద్దతు కూడగట్టాడు. అయితే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు అతని ఆశలకు గండికొట్టాయి. కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చేసిన పోరాటంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆవేశపరుడని, అనుభవం లేకుండా అధికారం కోసం ఆరాటపడుతున్నాడని, పెద్దలను గౌరవించడం లేదని విమర్శలు వచ్చాయి. అయినా జగన్ వాటిని లెక్కచేయలేదు. కాంగ్రెస్‌లో ఉంటే తన లక్ష్యం నెరవేరదని భావించి సాహోసోపేత నిర్ణయం తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అది పిల్ల కాంగ్రెస్ అని తల్లి కాంగ్రెస్, టీడీపీ వెక్కిరించినా లెక్కచేయకుండా గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లినా బెదరకుండా పార్టీని కాపాడుకున్నారు. ఓదార్పు యాత్రతో వైఎస్ అభిమానులను తనవైపు తిప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి గట్టిపోటీ ఇచ్చారు. జగన్ స్థానంలో మరొకరు, ముఖ్యంగా యువనేత, అనుభవం లేని మనిషి ఉంటుంటే, కాంగ్రెస్, టీడీపీల ఎత్తులకు చిత్తయి రాజకీపడిపోయేవాడని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత..

Related image

2014 ఎన్నికల్లో గెలుపు తననే వరిస్తుందనే అతి ఆత్మవిశ్వాసం జగన్ ఆశలకు గండికొట్టింది. చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ నుంచి పలు అంశాలపై జగన్ పునరాలోచనలో పడ్డాడు. అసలు ప్రజానాడి ఏంటో తెలుసుకోవాలంటే సొంత మీడియా సంస్థలు, అనుచరుల సర్వేలు, అవకాశం కోసం గోడలు దూకే నాయకుల సలహాలు, సూచనలు పనికిరావనుకున్నాడు. ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడానికి నేరుగా వారికి వద్దకు వెళ్లడం తప్ప మరోమార్గం తేదనుకుని ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టాడు. అది కూడా తన తండ్రి చేసినట్లుగా రెండు నెలల యాత్ర కాకుండా ఏకంగా ఏడాదికిగాపైగా.. 14 నెలల యాత్రకు సంకల్పించాడు. మొక్కవోని దీక్షతో యాత్రను సాగించారు. ఎండావానా, జ్వరం నుంచి కత్తి దాడి వరకు చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో సాగాడు. జగన్ అంటే మొండోడు అనే ప్రతికూల భావనను తన యాత్రతో సానుకూల భావనగా మార్చాడు.

ఓర్పుతో, ప్రేమతో..

జగన్ గత ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహం మార్చాడు. ప్రజలతో మేమకం కాకుండా, కేవలం ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తే ఫలితం ఉండదని, ప్రజలకు సంబంధించిన అనే అంశాలపై స్పందించారు. నిరాహార దీక్షలు, నిరసనలు, ధర్నాలు.. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రజాసమస్యలను ఓపిగా విన్నాడు. అంతే ఓపికగా స్పందించాడు. ఓదార్చాడు. తాను గతంలో చేసిన ఓదార్పు యాత్ర వైఎస్ అభిమానులకు మాత్రమే పరిమితమైందని, దాని ప్రభావం విస్తృత ప్రజానీకంపై లేదని అతనికి అర్థమైంది. కేవలం సానుభూతి మాత్రమే పనిచేయదని, నిత్యం ప్రజల్లోనే ఉంటేనే ఏదైనా సాధ్యమని భావించారు. రైతులు, కార్మికులు, పేదలు, అడ్డాకూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. మరెన్నో వర్గాల ప్రజల వద్దకు వెళ్లి వారితో ముచ్చటిస్తేనే అసలైన ప్రజానాడి తెలుస్తుందని, వారి అభిమానం చూరగొనొచ్చని అర్థం చేసుకున్నడు.. అందుకే తన యాత్రకు ప్రజా సంకల్ప యాత్ర అని పేరు పెట్టారు. ఆయనే చెప్పినట్లు తన పాదయాత్ర ఒక బ్రహ్మాస్త్రం..

Image result for ys jagan padayatra

జగన్ తన నడకలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గొంతు విప్పారు. టీడీపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. విపక్షం అంటే వైఎస్సార్ సీపీలా ఉండాలనే భావన తీసుకొచ్చారు. సభలు, ధర్నాలతో సాధ్యం కానిదాన్ని జగన్ యాత్రతో సాధ్యం చేశాడు. జగన్ ఆ దారిలో పోతున్నాడని తెలియగానే జనం అక్కడికి చేరుకుని అతనికి సమస్యలు వివరించారు. అతడు వాటిని మళ్లీ రోడ్డుపైనే సభలో ప్రస్తావించాడు. తద్వారా తాను నిత్యం జనంలో ఉంటున్నాను, ఉంటాను అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాడు. రాజకీయాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన ఆవేశంతో మాట్లాడినా, ఉత్తరాంధ్రలోని కిడ్నీ వ్యాధుల సమస్య నుంచి రైతులకు పంట నష్ట పరిహారం వరకు ఎన్నో అంశాలపై ఆవేదనతో స్పందించాడు. గణాంకాలతో వాస్తవాలను చెప్పడానికి యత్నించాడు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించాడు. ఒకవైపు కరడుగట్టిన ప్రతిపక్ష నేతగా, మరోవైపు ప్రజాసమస్యలపై ఆర్ద్రతతో స్పందించే మనుసున్న నేతగా తన కత్తికి రెండు వైపులా పదును అని నిరూపించుకున్నాడు.

Related image

మాటల్లో, ముఖంలో భావోద్వేగాలు పలకని సీఎం చంద్రబాబుకు, స్పందన లేని అతని ధర్మపోరాట దీక్షలకు భిన్నంగా జగన్ తనును అందరూ మన జగనన్నగా పిలుచుకునేంతగా యాత్రద్వారా జనానికి చేరువయ్యారు. ఇది కేవలం నడక ద్వారానే సాధ్యం కాలేదు. జనంతో మమేకం కావడం వల్ల అలవడిన సహానుభూతి, సున్నితత్వం, ఆప్యాయత, ప్రేమతోనే సాధ్యమైంది. యాత్ర ముగింపు సందర్భంగా జగన్ ఇస్తున్న ఇంటర్వ్యూల్లో, ప్రసంగాల్లో ఒకప్పటి ఆవేశపూరిత జగన్ కాకుండా ఒక పరిణతి, ఆర్ద్రత, ఆలోచన కలగలసిన జగన్ కనిపించడం యాత్ర ప్రభావమే. ఒక మాటలో చెప్పాలంటే 15 ఏళ్ల కిందట తన తండ్రి వైఎస్సార్ సాగించిన యాత్ర ఆయనలో ఎలాంటి మార్పులను, మానసిక పరివర్తనను, శాంతస్వభావాన్ని తీసుకొచ్చిందో జగన్ యాత్ర కూడా ఆయనలో అలాంటి మార్పులు తీసుకొచ్చింది. మరి ఈ కొత్త ఇమేజ్‌తో వచ్చిన ఆయనను ఆంధ్రప్రజలు స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా అన్నది తేలాలంటే ఆరు నెలలు వేచిచూడాల్సిందే…!!Telugu news YSR Congress leader Jagan mohan reddy mindset changed after padayatra in Andhra Pradesh become sensitive and thinking perseon

Updated : 20 Feb 2019 6:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top