జుకర్‌బర్గ్ జీతం రూ. 65..  ఖర్చు రూ. 57 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

జుకర్‌బర్గ్ జీతం రూ. 65..  ఖర్చు రూ. 57 కోట్లు

April 17, 2018

వెనకనుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు గానీ ముందునుంచి పుల్ల కూడా పోవద్దన్నట్టే వుంది ఫేస్‌బుక్ పెద్దమనిషి కథ. చరిత్ర సృష్టించేలా ఫేస్‌బుక్‌ను రూపొందించి, దాన్ని తన భుజ స్కంధాలపై మోస్తూ ముందుకు తీసుకువెళుతున్న మార్క్ జుకర్‌బర్గ్ నెల జీతం ఎంతో తెలుసా. అక్షరాలా ఒక డాలర్(రూ. 65) మాత్రమే. ఏంటీ.. డాలరే.. ఆ ఒక్క డాలర్లో పాపం ఆయనెలా బతుకుతాడని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే సంస్థలో ఆయనకున్న వాటాల విలువ అక్షరాలా 6,600 కోట్ల డాలర్లు (రూ.4.29 లక్షల కోట్లు) ఉంటుంది. కనుక ఆయన వ్యక్తిగతంగా భారీ వేతనం తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.కాకపోతే ఆయన భద్రత, ప్రయాణాల కోసం సంస్థ ఏకంగా 88 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.రూ.57 కోట్లు) ఖర్చు చేస్తోందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వివరాలను స్వయంగా ఫేస్‌బుక్కే వెల్లడించింది. ఆయన వేతనం ఒక డాలర్ అయినప్పటికీ ఆయన మీద ఏటా ఖర్చు చేస్తున్న వ్యయాన్ని ప్రకటించింది ఫేస్‌బుక్. జుకర్ బర్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి 73 లక్షల డాలర్లు, ఆయన విమానం కోసం 2017లో 15 లక్షల డాలర్లు ఖర్చయ్యాయి. 2016 లో 58 లక్షల డాలర్లు ఖర్చు చేశారు. ఏడాది తిరిగే సరికి ఆయనపై ఖర్చులు 50 శాతం పెరిగిపోయింది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ, ఛైర్మన్ అయిన జుకర్ బర్గ్‌కు బెదిరింపుల రీత్యా ఆయన భద్రత చాలా అవసరం అంటున్నారు ఫేస్‌బుక్ సిబ్బంది. కాబట్టి ఖర్చులను పట్టించుకోమన్నట్టు చెప్పారు. ఇదిలా వుండగా కంపెనీ సీఓఓ షెరిల్ శాండ్ బర్గ్ భద్రత కోసం కూడా 26 లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నట్టు తెలపడం గమనార్హం.