హైకోర్టు జడ్జి చొరవతో అనాథకు వైద్యం - MicTv.in - Telugu News
mictv telugu

హైకోర్టు జడ్జి చొరవతో అనాథకు వైద్యం

April 20, 2018

జడ్జీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న కాలం ఇంది. ఒక జడ్జి గుడికి వస్తున్నాడంటే పోలీసులు, బిల్ల బంట్రోతులు చేసే హడావుడి అంతా ఇంతాకాదు. సదరు జడ్జీలు కూడా ఈ గౌరవాలను  హాయిగా అనుభవిస్తుంటారు. అయితే జడ్జీలందరూ అలా వుండరు. కొందరు తమ పనేమిటో చేసుకుంటూ పరులకు ఉపకారం కూడా చేస్తుంటారు. అలాంటి వారిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ఒకరు. ఆయన సృహకోల్పోయిన వృద్దుడిని చొరవ తీసుకుని ఆస్పత్రిలో చేర్పించేలా చర్యలు తీసుకున్నారు.  జస్టిస్ శివశంకరరావు బుధవారం అన్నవరంలోని సత్యనారాయణస్వామిని దర్శించుకుని రాజమండ్రికి కారులో వెళ్తుండగా పెద్దాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఓ వృద్దుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. జడ్జి  వెంటనే కారు దిగి అతన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని రాజమండ్రి ప్రధాన జిల్లా జడ్జి ఎన్. తుకారామ్‌జీకి ఫోన్లో తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలను అందించాలని ఆదేశించారు.

తర్వాత  కోర్టు సిబ్బంది వృద్ధుడిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్య సిబ్బంది.. ఊరూపేరూ తెలియని వారిని చేర్చుకోమని మంకుపట్టారు. ఈ విషయం హైకోర్టు జడ్జికి తెలిపారు. దీంతో జస్టిస్ శివశంకరరావు మళ్లీ  ఆస్పత్రి సూపరిండెంట్‌కు ఫోన్ చేసి ఆ వృద్ధుడికి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. వైద్యులు వృద్ధుణ్ని ప్రత్యేక వార్డులో ఉంచి సేవలు అందిస్తున్నారు. శుభ్రంగా క్షవరం చేయించి, స్నానం చేయించి వైద్య సేవలు అందిస్తున్నారు.