కూచిభొట్ల శ్రీనివాస్‌ను చంపింది నేనే.. - MicTv.in - Telugu News
mictv telugu

కూచిభొట్ల శ్రీనివాస్‌ను చంపింది నేనే..

March 7, 2018

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆ దేశమంతటా విదేశీయులపై జాతి విధ్వాషాలు చెలరేగుతున్నాయి. భారతీయులు, ఇతర దేశస్థుల వరుస హత్యలు అక్కడ కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని కేన్సస్‌లో ఫిబ్రవరి  27న జరిగిన జాతి విద్వేష దాడిలో భారతీయుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ఆడం పురింటన్‌ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. నిందితునికి మే 4న శిక్ష ఖరారు కానుంది. పథకం ప్రకారం చేసిన ఈ హత్యకు గాను అతనికి పెరోల్‌ లేకుండా 50 ఏళ్ల వరకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది.ఫిబ్రవరిలో కూచిభొట్ల శ్రీనివాస్ అతని స్నేహితుడితో కలిసి కాన్సస్‌లోని ఆస్టిన్స్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లోకి మద్యం సేవించేందుకు వెళ్లారు.

అక్కడ వారిని చూసిన నిందితుడు పూరింటన్‌ జాతివిద్వేషంతో దూషణలకు దిగాడు. ‘ నా దేశం నుంచి వెళ్లిపోండి ’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతన్ని బార్‌ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సిబ్బంది చెప్పారు. బయటకు వెళ్లిన పురింటన్ తుపాకీతో వచ్చి ఇద్దరి మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ కూచిభొట్ల చనిపోగా స్నేహితుడు గాయాలపాలయ్యాడు. తన భర్తను చంపిన నిందితుడు నేరాన్ని అంగీకరించిన సందర్భంగా శ్రీనివాస్ భార్య సునయన స్పందించారు. ‘ విద్వేషం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందరూ అందించాలి. మనమంతా పరస్ఫరం ప్రేమించుకోవాలి గానీ ధ్వేషింకోకూడదు ’ అని పేర్కొన్నారు.