విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రం వివాదంగా మారడంతోపాటుగా కలెక్షన్లతో కూడా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో జీఎస్టీపై విజయ్ చెప్పిన డైలాగులపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రగడ పూర్తిగా ముగియకముదే మరో తమిళ సినిమా కూడా జీఎస్టీపై తనదైన రీతిలో సెటైర్లు వేసింది.
‘రంగం’చిత్రం ఫేం జీవా కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం‘ కీ.’ ఈ చిత్రానికి సంబందించిన ప్రోమోను గురువారం విడుదల చేశారు.ఈ ప్రోమోలో జీఎస్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆర్జే బాలజీ మరో వ్యక్తితో మాట్లడుతూ… ‘నేనొక కథ చెప్పనా సిద్దార్థ్ సార్? మీరు నేను రెస్టారెంట్‌కు వెళ్లాం. బిల్లు చూస్తే భారీగా వచ్చింది. ఎంతలా అంటే మనతో పాటు మరో ఇద్దరు కూడా కలసి తిన్నంత. ఆ ఇద్దరు వ్యక్తులెవరో మీకు తెలుసా? వాళ్లే జీఎస్టీ. వాళ్లు మరొకరి కడుపు మండేలా చేస్తారు’ అని చెప్తాడు. రెస్టారెంట్‌కు బీఎస్టీ భారాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ ప్రోమోలో ఉంది.
మెర్సల్ వివాదానికి ముందే కీ డబ్బింగ్ పూర్తి అయింది. కానీ ఈ ప్రోమో ఇప్పుడు విడుదల చేయడానికి గల కారణం ప్రజలకు సందేశాన్ని పంపాలన్న ఉద్దేశమేనని ఆర్జే బాలజీ వివరించారు. సమస్యల గురించి ప్రస్తావించిన ఒక్క సినిమాను ఆపాలంటే మరిన్ని చిత్రాలు పుట్టుకొస్తాయని తెలిపాడు. ప్రజల అభిప్రాయాలను చెప్పడాన్ని నిలువరించడం ఎవరి వల్లా కాదని ఆర్జే పేర్కొన్నారు. తాము భయపడటం లేదని చెప్పాలనుకుంటున్నామని, మా భావాలను వ్యక్తపరిచడాన్ని ఎవరూ ఆపలేరంటూ బీజేపీపై పరోక్షంగా విమర్శనలు చేశారు. ఈ ప్రోమోపై బీజేపీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.