గడ్డం ఉందని పెళ్లిచేసుకోనంది.. తర్వాత.. - MicTv.in - Telugu News
mictv telugu

గడ్డం ఉందని పెళ్లిచేసుకోనంది.. తర్వాత..

March 14, 2018

పెళ్లికొడుకు‌కు గడ్డం ఉందని ఓ పెళ్లికూతురు పెళ్లికి నిరాకరించింది. దీంతో అతడు హతాశుడయ్యాడు. అయితే తర్వాత కథ కంచికి కూడా సుఖాంతమైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని అజంటి గ్రామంలో జరిగింది.  రూపాలీ , మంగళ్ సింగ్‌ అనే యువతీ యువకులకు పెళ్లి నిశ్చయించారు. ముహూర్తం రోజున మంగళ్ ఎంచక్కా చక్కని గడ్డంతో ఊరేగింపుగా వచ్చాడు. అయితే అతణ్ని ఆ రూపంలో చూసిన రూపాలీ అగ్గిమీద గుగ్గిలమైంది.

ఈ పెళ్లికొడుకు తనకు వద్దని, గడ్డమున్నోడిని చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో మగపెళ్లి వారు తలలు పట్టుకున్నారు. అలిగిన పెళ్లికూతురిని ఒప్పించడానికి నానా తిప్పలూ పడ్డారు. గడ్డం గీసుకుని వస్తేనే తాళి కట్టించుకుంటానని రూపాలీ తేల్చేసింది. అందుకు అందుకు మంగళ్ ససేమిరా అన్నాడు. దాంతో రెండు కుటుంబాల మధ్య రగడ మొదలైంది.

ఎక్కడ కొట్టుకుని ఛస్తారేమోని గ్రామస్తులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు వరుడికి నచ్చజెప్పారు. దాంతో మంగళ్ఎట్టకేలకు దిగొచ్చాడు. కానీ అప్పటికే ముహూర్తం దాటిపోయింది. మంగళ్ తర్వాత షేవింగ్ చేసుకున్నాడు. మర్నాడు ఉదయం పెళ్లి జరిగింది. మంగళ్ పెళ్లిచూపులకు వచ్చినపుడు గడ్డం లేదని, అందుకే రూపాలీ అతణ్ని ఒప్పుకుందని బంధువులు చెప్పారు. మంగళ్ సింగ్‌కు ఏదో మొక్కువున్న కారణంగా గడ్డం పెంచాడట.