5 వేలమంది పొట్టకొట్టిన నీరవ్ మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

5 వేలమంది పొట్టకొట్టిన నీరవ్ మోదీ

February 21, 2018

వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో సహ దాదాపు 30 బ్యాంకులకు రూ. 17 వేల కోట్లకు పైగా ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. అయితే పాపం చేసింది ఒకరు అనుభవించేది మరొకరు అన్నట్లు అతని పాపాలకు వేల బతుకులు చితికిపోయాయి. నీరవ్  మేనమామ అయిన మేహుల్ చౌక్సీకి చెందిన ‘గీతాంజలి జమ్స్’ దుకాణాలు దేశవ్యాప్తంగా మూతబడ్డాయి. నీరవ్ స్కాం బయటపడడంతో  గీతాంజలి దుకాణాలపై  సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయి. దుకాణంలో  ఉన్న ప్రతి వస్తువును సీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే, ఉద్యోగులందరికీ సంస్థ నోటీసులు ఇచ్చింది. అంతేకాక  మరో ఉద్యోగాన్ని వెతుక్కోమని  ఓ ఉచిత సలహా ఇచ్చింది.  ఈ  రోజు ఉదయం కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోని గీతాంజలి జెమ్స్ స్టోర్ల మందు షట్‌డౌన్ బోర్డులు పెట్టారు. దాంతో ఆ సంస్థలో పనిచేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గీతాంజలి సంస్థకు చెందిన  అధికారిక వెబ్‌సైట్ మూడు రోజుల క్రితమే మూతబడిన సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయాలని పలు ప్రాంతాల్లో ఉద్యోగులు  షాపుల ముందు బైఠాయించారు. దాంతో ఆయా ప్రాంతాల్లో  పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని గీతాంజలి స్టోర్ ఉద్యోగులు కూడా ధర్నా చేస్తున్నారు.