పాక్ యువతిని సొంత కూతురిలా చూసుకున్న శ్రీదేవి - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ యువతిని సొంత కూతురిలా చూసుకున్న శ్రీదేవి

February 26, 2018

అందాల తార శ్రీదేవి మరణంపై పాక్ యువ నటి సజల్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది . 2017లో వచ్చిన ‘మామ్’ చిత్రంలో శ్రీదేవి కూతురిగా సజల్ నటించింది. ‘ఈ రోజు నా తల్లిని మరోసారి కోల్పోయాను అని’ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. యాదృచ్ఛికంగా ‘మామ్ సినిమా చిత్రీకరణ సమయంలోనే సజల్ తల్లి మరణించింది.

అలాంటి కష్టమైన సమయంలో  సజల్‌‌కు శ్రీదేవి అండగా నిలిచింది. సజల్ తన తల్లి చనిపోయిన విషయాన్ని పాక్ నుంచి శ్రీదేవికి ఫోన్లో తెలిపి  భోరున విలపించింది. ఆ తర్వాత సజల్‌ను శ్రీదేవి తన సొంత కుతూరిలా చూసుకుంది. ఆమె ఓదార్చి, ఏం భయపడొద్దని, తానున్నానని భరోసా ఇచ్చింది. శ్రీదేవితో అనుబంధాన్ని కేవలం సినిమా విషయంగా  చూడలేదని, అది తన హృదయానికి తాకిందని సజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. సాధారణంగా శ్రీదేవి తన సహచర నటులతో అంత తొందరగా కలిసిపోరు. సెట్స్‌లో పూర్తిగా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తారు. కానీ సజల్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా శ్రీదేవి స్పందించారు.