మా నాన్నకు చెప్పి నీ జాబ్ తీసేయిస్తా... డీజీపీ కూతురు వీరంగం - MicTv.in - Telugu News
mictv telugu

మా నాన్నకు చెప్పి నీ జాబ్ తీసేయిస్తా… డీజీపీ కూతురు వీరంగం

April 3, 2018

అమ్మానాన్నలు మంచి పొజీషన్‌లో వుంటే వారి పొజీషన్‌ను వాడుకొని వాళ్ళ పిల్లలు ఓవరాక్షన్ చేయటం ఈ మధ్య పరిపాటిగా మారింది. తల్లిదండ్రులు గౌరవమున్న హోదాలో వుంటే వాళ్ళ పిల్లలు వారి విలువలకు నీళ్ళు వదిలేలా ప్రవర్తిస్తుంటారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రెచ్చిపోతుంటారు. అలాంటి ఘటనే చెన్నైలోని పాలవక్కం బీచ్  వద్ద చోటు చేసుకుంది. ఓ ఐపీఎస్ అధికారి కూతురు తప్పతాగి పోలీసుల విధులకు ఆటంకం కలిగించింది. వాహనం నడుపుతూ పోలిసులకు పట్టుబడి వీరంగం సృష్టించింది. ‘ మా నాన్న ఎవరో తెలుసా? నన్నే అడ్డుకుంటావా? ఎంత ధైర్యం నీకు’ అంటూ ఓ ఐపీఎస్ అధికారి కూతురు విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను బండ బూతులు తిట్టింది. అంతటితో ఆగకుండా నీ ఉద్యోగం తీసేస్తాను అని కానిస్టేబుల్‌‌ను హెచ్చరించింది. అంతేకాక తాగి ఉన్న సమయంలోనే తన తండ్రికి ఫోన్ చేసి ,తనను ఆపిన కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగాంచాలని చెప్పింది. ఆమె చేసే  రచ్చ మొత్తాన్ని సదురు కానిస్టేబుల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.


తమిళనాడు అదనపు  డీజీపీ తమిళ్ సెల్వన్ కూతురు తన స్నేహితులతో కలసి వాహనంలో వెళ్తున్న సమయంలో కానిస్టేబుల్ ఆమెను అడ్డుకున్నాడు. ఆ సమయంలో ఆమె మద్యం మత్తులో ఉంది. కానిస్టేబుల్  తనిఖీలకు సహకరించాలని కోరాడు. కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోక పోలీసు అధికారి కూతుర్ని అనే గర్వంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను హెచ్చరించింది. ఇప్పుడు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఆమె తన వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్‌పైనా కౌంటర్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసు కానిస్టేబుల్‌ అతిగా ప్రవర్తించాడని, వద్దని వారిస్తున్నా వీడియో తీసి, తమకు ఇబ్బంది కల్పించాడని, అతనిపై చర్య తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు.