దివాళా తీయనున్న ఎయిర్‌సెల్.... - MicTv.in - Telugu News
mictv telugu

దివాళా తీయనున్న ఎయిర్‌సెల్….

February 22, 2018

టెలికాంలో ముమ్మరమైన పోటీని తట్టుకొని నిలబడలేక త్వరలో ఎయిర్‌సెల్‌ మూతపడనుంది. రుణభారం పెరిగిపోవడంతో ఈ కంపెనీ దివాళా తీయనుంది.  సుమారు రూ. 15,500 కోట్ల రుణాలు పేరుకుపోవడంతో కంపెనీ త్వరలో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముందు దివాళా పిటిషన్‌ దాఖలు చేయనుంది. మలేషియాకి చెందిన మాతృ సంస్థ మ్యాక్సిస్‌ గతంలో ఎయిర్‌సెల్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినప్పటికీ. ఆ తర్వాత వెనక్కి తగ్గింది.

రూ. 15,500 కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ కోసం గతేడాది సెప్టెంబర్‌ నుంచి బ్యాంకులతో ఎయిర్‌సెల్‌ చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా  ఫలితం  లేకుండా పోయింది. ప్రస్తుతం  వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఎయిర్‌సెల్  దగ్గర కనీస స్థాయిలోనిధులు కూడా లేవు.ఈ వారాంతంలో ఉద్యోగుల జీతాలను చెల్లించడం కూడా నిలిపివేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. కంపెనీ సీఈవో సైతం ఉద్యోగుల‌కు ఒక మెయిల్ రాశార‌ని స‌మాచారం. అందులో కంపెనీ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారేందుకు సైతం అవ‌కాశ‌మున్న‌ట్లు ఉద్యోగుల‌ను హెచ్చ‌రించారని టెలికాంటాక్ రిపోర్ట్ నివేదిక తెలిపింది.

ప్ర‌స్తుతం ఆర్థికంగా నష్టపోయిన  ఎయిర్‌సెల్ ఇప్ప‌టికే ఆరు స‌ర్కిళ్ల‌లో త‌న సేవ‌ల‌ను నిలిపివేసింది. అప్పుల భారంతో ఇబ్బందుల్లో ఉన్న మ‌రో ప్ర‌ధాన టెలికాం సంస్థ రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్‌తో ఎయిర్‌సెల్ సంప్ర‌దింపుల‌ను మొద‌లుపెట్టింది. అయితే దానికి సంబంధించి నియంత్ర‌ణ సంస్థ‌ల నుంచి స‌రైన స‌మ‌యంలో అనుమ‌తులు రాలేదు. అంతే కాకుండా ఎయిర్‌సెల్ వ‌ద్ద ఉన్న స్పెక్ట్రంను అమ్మేందుకు సుప్రీంకోర్టు అంగీక‌రించ‌లేదు. దాంతో ఈ మెర్జింగ్ ప్ర‌క్రియ‌కు బ్రేకులు ప‌డ్డాయి. దీంతో ఎయిర్‌సెల్ రుణ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ కోసం  తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ  ప్రయత్నాలు సఫలం కాలేదు.