వైద్యుడి ఘాతుకం.. 40మందికి ఎయిడ్స్... - MicTv.in - Telugu News
mictv telugu

వైద్యుడి ఘాతుకం.. 40మందికి ఎయిడ్స్…

February 6, 2018

ఓ నకిలీ వైద్యుడు  చేసిన నిర్వాకంతో  40 మంది ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్‌లో జరిగింది.  వైద్యుడినంటూ  చెప్పుకునే ఓ వ్యక్తి తన వద్దకు వచ్చే రోగులకు ఇంజక్షన్‌ ఇవ్వడానికి ఒకే సిరంజిని ఉపయోగించాడు. దాంతోనే బాధితులకు ఎయిడ్స్ వచ్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

బంగార్‌మౌలోని మూడు ప్రాంతాల్లో జనవరిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో 566 మందికి వైద్య పరీక్షలు చేశారు. అందులో 40 మందికి హెచ్ఐవీ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఒకే ప్రాంతంలో ఇంత ఎక్కువ మంది హెచ్ఐవీ బారిన పడడంతో అనుమానం వచ్చిన ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ బంగార్ మౌలోని ప్రేమ్‌గంజ్, చక్మీర్‌పూర్ ప్రాంతాల్లో పర్యటించి  నివేదికను రూపొందించింది.

ఈ నివేదికను చూసి అదికారులు నివ్వెరపోయారు.ఈ దారుణానికి కారణమైన రాజేంద్ర కుమార్  లైసెన్స్ రద్దు చేసి, కఠిన చర్యలను తీసుకుంటామని వైద్య ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. వైద్యుడిపై కేసు నమోదు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితులను చికిత్స నిమిత్తం కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు.