తెలుగు జర్నలిజం ఇదీ.. రామచంద్రమూర్తి - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు జర్నలిజం ఇదీ.. రామచంద్రమూర్తి

March 4, 2019

తెలుగు నాట జర్నలిజం విలువలు పడిపోతున్నాయని ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రలో కులంపేరుతో పోలరైజేషన్ జరిగిందని అన్నారు. సంపాదకుడిగా, రచయితగా, ప్రజామేధావిగా నాలుగున్నర దశాబ్దాల తన అనుభవాలను, అంతరంగాన్ని ఆయన మైక్ టీవీ సతీశ్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

తెలుగు పత్రికలు, టీవీల తీరును ఆయన విశ్లేషించారు. 1980ల నుంచి నేటి దాకా ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో, పత్రికల్లో వచ్చిన మార్పులను వివరించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ తదితర నేతల వ్యక్తిత్వాలను విశ్లేషించారు.  ఆధునిక తెలుగు జర్నలిజంలో రామచంద్రమూర్తిది విస్మరించలేని అధ్యాయం. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, వార్త, సాక్షి దినపత్రికల్లో సంపాదకుడిగా, రచయితగా, నిర్వహణ బాధ్యుడిగా పనిచేశారు, పనిచేస్తున్నారు. అటు పత్రికల్లో, ఇటు టీవీలో ఆయన వర్తమాన రాజకీయాలపై చేసే పదునైన, ఆలోచనాత్మక విశ్లేషణలు మేధావులనే కాదు, సామాన్యులను సైతం ఆకట్టుకుంటున్నాయి. పాత్రికేయ వృత్తిని పరమపవిత్రంగా భావించిన ఆయన తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో తెలుగు సమాజాన్ని చైతన్యవంతం చేశారు. రాజకీయాలు, సంస్కృతి, సమాజం, సాహిత్యం.. వంటి మరెన్నో అంశాలపై సునిశిత రచనలతో, విశ్లేషణలతో పాఠకులకు, వీక్షకులకు చేరువయ్యారు. జర్నలిజంతోపాటు ఎన్నో విషయాలపై గట్టిపట్టున్న ఆయన ఆయా అంశాలపై సాధికార పుస్తకాలు కూడా రాశారు. రచయితగానే కాకుండా ఒక సామాజికవేత్తగానూ ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తుంటారు. బాధితులకు అండగా నిలుస్తుంటారు. మావోయిస్టులతో చర్చలకు ప్రభుత్వాన్ని ఒప్పగించడానికి కృషి చేసిన వారిలో రామచంద్రమూర్తి ఒకరు. ఇంతటి సుదీర్ఘ పాత్రికేయ అనుభమమున్న ఆయన ఏం చెబుతున్నారో చూడండి..