'తెలుగు రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలి' - MicTv.in - Telugu News
mictv telugu

‘తెలుగు రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలి’

June 4, 2020

krishna

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం నేపథ్యంలో వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణ బోర్డు యాజమాన్యం సమావేశం అయింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వాడీవేడీ వాదనలు వినిపించాయి. తెలంగాణ తరపున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ తరపున ఆదిత్యనాథ్ దాస్ వాదనలు వినిపించారు. హైదరాబాదులోని జలసౌధలో సుదీర్ఘ సమయం పాటు ఈ భేటీ కొనసాగింది.

సమావేశం తరువాత బోర్డు చైర్మన్ పరమేశం మీడియాతో మాట్లాడుతూ..’ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని సూచించాం. శ్రీశైలం నుంచి 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వరద సమయంలో ఉపయోగించిన జలాలకు సంబంధించిన అంశాలను కమిటీ పరిశీలిస్తోంది. తాగునీటి వినియోగాన్ని 20 శాతం లెక్కింపుపై జల సంఘానికి నివేదించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు తరలించిన జలాల అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాం. కృష్ణా బోర్డును ఏపీ రాజధానికి తరలించే అంశంలో కేంద్ర జలశక్తి శాఖదే తుది నిర్ణయం. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు డీపీఆర్ లు ఇవ్వాలని స్పష్టం చేశాం. అనుమతులు తీసుకుని డీపీఆర్ లు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.’ అని తెలిపారు.