ఛల్ ఛల్ రొటీన్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఛల్ ఛల్ రొటీన్..

April 5, 2018

త్రివిక్ర‌మ్ క‌థ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్మాత.. ఓ సినిమాపై అంచ‌నాలు ఆకాశ‌న్నంట‌డానికి ఈ రెండు పేర్లు చాలు. ‘ఛ‌ల్ మోహ‌న్‌రంగ’ విష‌యంలో అదే జ‌రిగింది. నితిన్ మీద ఉన్న అభిమానంతో త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు క‌థ‌ను అందిస్తే ఎన్‌.సుధాక‌ర్‌రెడ్డితో క‌లిసి ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఈ చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామి అయ్యారు.  మూహూర్తం రోజు నుంచే ఈ సినిమా కోసం నితిన్ అభిమానుల‌తో పాటు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూశారు. ‘రౌడీఫెలో’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప్ర‌శంస‌ల్ని అందుకున్న కృష్ణ‌చైత‌న్య కొంత విరామం త‌ర్వాత మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టి ఈ సినిమాను తెర‌కెక్కించారు. అ ఆ త‌ర్వాత స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఈ సినిమాపై  ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ అ, ఆ సినిమాలో వ‌ర్క‌వుట్ అయినా త్రివిక్ర‌మ్ మ్యాజిక్ ఈసారి ప‌నిచేయ‌లేదు.

మోహ‌న్‌రంగకు అమెరికా వెళ్లాల‌నేది క‌ల‌. డిగ్రీ థ‌ర్డ్‌క్లాస్‌లో పాస్ కావ‌డంతో నాలుగేళ్లు అత‌డి వీసా తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది. దాంతో ఓ  గొప్పింటి పెద్దావిడ‌ చ‌నిపోతే ఆమె భౌతిక‌కాయాన్ని తీసుకుని అమెరికా వెళ్లిన మోహ‌న‌రంగ అక్క‌డే ఓ ఉద్యోగాన్ని వెతుక్కునే ప్ర‌య‌త్నాలు చేస్తాడు.   మేఘా సుబ్ర‌హ్మ‌ణ్యం( మేఘా ఆకాష్‌) అత‌డికి స‌హాయం చేస్తుంది. కొద్దిపాటి ప‌రిచ‌యంలోనే ఇద్ద‌రు ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌తారు. మేఘా, మోహ‌న్‌రంగ‌ల‌వి భిన్న నేప‌థ్యాలు కావ‌డం, ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న అపోహ‌ల కార‌ణంగా త‌మ ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుచుకోకుండానే దూర‌మైపోతారు. మోహ‌న్‌రంగకు దూరంగా ఊటీ ద‌గ్గ‌ర‌లోని కూనూర్ అనే ఊరికి వెళ్లిపోతుంది మేఘా. ఆమె దూర‌మైన త‌ర్వాత ప్రేమ విలువ‌ను తెలుసుకున్న మోహ‌న్‌రంగ‌..మేఘా వెతుక్కుంటూ కూనూర్ వ‌స్తాడు. మ‌రికొద్ది క్ష‌ణాల్లో జ‌ర‌గ‌నున్న మేఘా పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతాడు. ఏడాది  దాటిన కూడా మోహ‌న్‌ను మేఘా ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ త‌మ మ‌ధ్య ఉన్న అహం కార‌ణంగా ఇద్ద‌రు బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతుంటారు. చివ‌ర‌కు వారిద్ద‌రు ఎలా క‌లుసుకున్నారు? మేఘాను ప్రేమిస్తున్న విష‌యాన్ని మోహ‌న్ ఏ ప‌రిస్థితుల్లో చెప్ప‌వ‌ల‌సివ‌చ్చింద‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

ధ‌న‌వంతురాలైన అమ్మాయి, జీవితంపై స‌రైన క్లారిటీ లేని అబ్బాయికి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ ఇది. స‌ర‌దాగా మొద‌లైన వారి ప్రేమ‌ప్ర‌యాణంలో అంత‌రాలు, అపోహ‌ల కార‌ణంగా ఎలా  భేదాభిప్రాయాలు నెల‌కొన్నాయి తిరిగి వారిద్ద‌రు ఏ విధంగా ఏక‌మ‌య్యార‌న్న‌దే ఈ చిత్ర క‌థాంశం. త్రివిక్ర‌మ్ చెప్పిన చిన్న పాయింట్‌ను న‌మ్మి ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య ఈ సినిమాను తెర‌కెక్కించారు. వినోదానికి ప్రేమ‌క‌థ‌ను జోడించి తక్కువ పాత్ర‌ల‌తో క‌థ‌ను చెప్పాల‌ని చూశారు. క‌థ‌లో కొత్త‌ద‌నం లోపించ‌డం, సినిమాగా మ‌లిచేంతా విష‌యం లేక‌పోవ‌డంతో ఛ‌ల్‌మోహ‌న్‌రంగ నిరాశ‌ప‌రిచింది.తొలిప్రేమ‌, హ‌లో ఛాయలు ఈ సినిమాలో చాలా చోట్ల క‌నిపిస్తాయి. పాత్ర‌లు, వాటి నేప‌థ్యాలు అన్నీ పాత సినిమాల్ని గుర్తుకుతెస్తాయి. ప్ర‌థ‌మార్ధాన్ని  వినోద‌భ‌రితంగా న‌డిపించారు ద‌ర్శ‌కుడు. అమెరికా వెళ్ల‌డానికి నితిన్ ప‌డే పాట్లు, అక్క‌డ ఉద్యోగం కోసం చేసే ప‌నులు న‌వ్విస్తాయి. నితిన్‌, మేఘా ఆకాష్ ప్రేమ‌క‌థ‌ను స‌ర‌దాగానే చూపించారు.  ద్వితీయార్ధంలో ప్రేమికుల మ‌ధ్య ఎడ‌బాటు, ఒక‌రికొక‌రు దూర‌మై వారు ప‌డే బాధ‌ను చూపించ‌డానికే ప్రాధాన్య‌త‌నిచ్చారు. కానీ ఆ సంఘ‌ర్ష‌ణ స‌రిగా పండ‌లేదు. వారిద్ద‌రు ఎందుకు విడిపోయారో, ఒక‌రినొక‌రు ఎందుకు ద్వేషించుకుంటున్నారో ఎంత‌కి అంతుప‌ట్ట‌దు.  అందులో కామెడీని బ‌ల‌వంతంగా ఇరికించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో సినిమాను సాగ‌తీసిన అనుభూతి క‌లుగుతుంది. మొత్తం టైమ్‌పాస్ చేస్తూ చివ‌ర‌కు ఓ యాక్సిడెంట్ ద్వారా వారి మ‌ధ్య ఉన్న అభిప్రాయ‌భేదాల్ని వీడిపోయేలా చూపించారు. ద్వితీయార్ధం సినిమా పూర్తిగా మైన‌స్‌గా మారింది. కామెడీ, ఎమోష‌న్ రెండు వ‌ర్క‌వుట్ కాలేదు.

సినిమాలో మొత్తం త్రివిక్ర‌మ్ ఛాయ‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఆయ‌న శైలి ప్రాస‌లు, పాత్ర‌ల పేర్లు, స‌న్నివేశాలు ఇలా ప్ర‌తి చోట త్రివిక్ర‌మ్ మార్కు క‌నిపిస్తుంది. త్రివిక్ర‌మ్ అస‌లు ద‌ర్శ‌కుడు అనే అనుభూతి క‌లుగుతుంది. పూర్తిగా ఆయ‌న శైలిని న‌మ్మే ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య  ఈ సినిమాను రూపొందించాడు. అత‌డి సొంత‌ ముద్ర ఎక్క‌డ క‌నిపించ‌లేదు. అది కూడా మైన‌స్‌గా మారింది.

అమెరికా మోజు క‌లిగిన న‌వ‌త‌రం యువ‌కుడిగా, విఫ‌ల ప్రేమికుడిగా భిన్నపార్శ్వ‌ాల‌తో కూడిన పాత్ర‌లో చ‌క్క‌టి వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు నితిన్‌. ప్ర‌థ‌మార్ధం వినోదాత్మ‌కంగా, ద్వితీయార్ధంలో భావోద్వేగ ప్ర‌ధానంగా అత‌డి పాత్ర సాగుతుంది.  అయితే క‌థ‌లో కొత్త‌ద‌నం క‌రవ‌వ్వ‌డంతో నితిన్‌కు ఈ సినిమా మ‌రోసారి నిరాశ‌నే ప‌రిచింది. అయితే ఈ సినిమాతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ట్ల, మెగా కుటుంబం మీద ఉన్న అభిమానాన్ని చాలా చోట్ల చాటుకున్నారు. ఖైదీ నంబ‌ర్ 150, అజ్ఙాత‌వాసి సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకొని నితిన్‌, ప‌మ్మీసాయి, స‌త్య‌ల మ‌ధ్య కామెడీ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. మేఘా ఆకాష్ గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. ఆమె న‌ట‌న‌లో ఇంకా ప‌రిణితి రావాలి.

హీరోయిన్ త‌ల్లి పాత్ర‌తో సీనియ‌ర్ న‌టి లిజి ఈ సినిమాతో చాలా కాలం త‌ర్వాత తెలుగులో పున‌రాగ‌మ‌నం చేసింది..త‌ల్లీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్క‌రించే స‌న్నివేశాల‌పై ద‌ర్శ‌కుడు దృష్టిసారిస్తే సినిమా మ‌రో స్థాయిలో ఉండేది. రావుర‌మేష్‌, న‌రేష్ త‌మ‌కు అల‌వాటైన పాత్ర‌ల్లో క‌నిపించారు. ప‌మ్మీసాయి,  స‌త్య, మ‌ధుసూదన్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రుల‌పై చిత్రీక‌రించిన స‌న్నివేశాల్లో వినోదం పాళు త‌గ్గింది.

త‌మ‌న్ బాణీలు, న‌ట‌రాజ సుబ్ర‌మ‌ణియ‌న్ ఛాయాగ్ర‌హ‌ణం క‌థ‌లోని ఎమోష‌న్ బ‌లంగా చాటిచెప్ప‌డానికి దోహ‌ద‌ప‌డ్డాయి.  అమెరికా, ఊటీ అందాల్ని స‌హ‌జంగా చూపించారు కెమెరామెన్‌, త‌మ‌న్ బాణీల్లో మియామీ గీతం ఆక‌ట్టుకుంటుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, సుధాక‌ర్‌రెడ్డి ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డ రాజీప‌డ‌కుండా ఈ సినిమాను తెర‌కెక్కించారు.

రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. క‌థ‌, క‌థ‌నాలు, నాయ‌కానాయిక‌ల పాత్ర‌చిత్ర‌ణ అన్ని గ‌తంలో తెలుగులో వ‌చ్చిన చాలా సినిమాల్ని గుర్తుకుతెస్తాయి. కొత్త‌ద‌నం ఊసే సినిమాలో క‌నిపించ‌దు.  త్రివిక్ర‌మ్ క‌థ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు, ఇమేజ్ఈ సినిమాకు క‌లిసిరాలేదు.

రేటింగ్‌:2/5