భక్తులకు శుభవార్త..త్వరలో ఆలయాలు ఓపెన్!
లాక్ డౌన్ కారణంగా మూతపడిన వాటిలో ఆలయాలు కూడా ఉన్నాయి. కేవలం కొందరు పూజారులు మాత్రం గుడిలో ఉండి పూజలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులను అనుమతించడం లేదు. దీంతో ఎందరో భక్తులు నిరాశ చెందుతున్నారు. ఇటీవల కేంద్రం మద్యం షాపులను తెరవడానికి అనుమతివ్వడంతో.. దేవాలయాలను కూడా తెరవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ భక్తులను ఆలయాల్లోకి అనుమతించాలని ఆ దేవాలయాల బోర్డులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ రెండు ఆలయాల్లోని భక్తుల క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించేలా సిబ్బంది సర్కిల్స్ గీశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత భక్తులను ఆలయాల్లోకి అనుమతించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఈ రెండు దేవస్థానాలకు సంబంధించిన అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రయోగం ఇక్కడ విజయవంతం అయితే మిగతా ఆలయాలకు, ప్రార్థనా నిలయాలకు దీనిని విస్తరించనున్నారు.