ఆ డ్రైవర్ దొరికాడు.. అడవిలో ఒంటరిగా 15 రోజులు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ డ్రైవర్ దొరికాడు.. అడవిలో ఒంటరిగా 15 రోజులు..

October 30, 2019

Tempo driver balakrishna location found

ప్రమాదాలు జరిగిన తరువాత కేసులకు భయపడి కొందరు డ్రైవర్లు పారిపోతుంటారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉండి మళ్ళీ బయటికి వస్తారు. అయితే అక్టోబర్ 15న తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో జరిగిన టెంపో ప్రమాదంలో డ్రైవర్ బాలకృష్ణ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు బాలకృష్ణ కోసం వెతుకుతున్నారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది.

తాజాగా డ్రైవర్ బాలకృష్ణ ఆచూకీ లభించింది. 15 రోజులుగా అటవీ ప్రాంతంలోనే ఒంటరిగా తిరుగుతూ ఆహారం లేక నీరసించిపోయిన బాలకృష్ణను స్థానిక గిరిజనులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు స్థానికుల సహాయంతో బాలకృష్ణను డోలీపై మారేడుమిల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాచలం నుండి అన్నవరం తీర్థ యాత్రకు టెంపో ట్రావెలర్‌ వాహనంలో వెళ్తుండగా టెంపో బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ఉండగా, ఏడుగురు మృతి చెందారు. మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. మడకశిరకు చెందిన టెంపో డ్రైవర్ బాలకృష్ణ ఆచూకీ లభించకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయాడని అంతా భావించారు.