మా పరిస్థితేంటి సారూ? ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగుల ధర్నా - MicTv.in - Telugu News
mictv telugu

మా పరిస్థితేంటి సారూ? ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగుల ధర్నా

December 3, 2019

‘ఓడ దాటేవరకు ఓడ మల్లయ్య.. ఓడ దాటాక బోడి మల్లయ్య’..  ఈ సామెతను తెలంగాణ ఆర్టసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు పదేపదే గుర్తుచేస్తున్నారే. పాపం వారి పరిస్థితి రెండొద్దుల పండగ, వాడి పారేసిన టిష్యే పేపర్ మాదిరి అయిపోయింది? దాదాపు 55 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయగా.. ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించకపోతే తాత్కాలిక ఉద్యోగులతోనే ఆర్టీసీని నడిపిస్తామని ప్రభుత్వం వెల్లడించింది కూడా. దీంతో పాపం వాళ్లు ఆర్టీసీ ఉద్యోగం వస్తుందని ఆశపడ్డారు.. చివరికి భంగపడ్డారు. ప్రైవేట్ కార్లు, క్యాబులు, ఆటోలు, జీపులు, స్కూలు బస్సులు నడుపుకుంటున్న డ్రైవర్లు ఆర్టీసీ స్టేరింగ్ పట్టారు. ఈ జాబ్ తమకు శాశ్వతం అవుతుందని భావించారు. కానీ, వారి ఆశలు అడియాశలు అయ్యాయి. 

Temporary Employees.

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు ఫుల్‌స్టాప్ పెట్టారు. దీంతో వారు ఎప్పటిలానే విధుల్లోకి వెళ్తున్నారు. వారు విధుల్లోకి వస్తే ఇన్ని రోజులు బస్సులు నడిపిన తాత్కాలిక ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇదే ప్రశ్న వారు ప్రభుత్వానికి వేస్తున్నారు. సమ్మెకాలంలో పనిచేసిన తాత్కాలిక డ్రైవర్లు , కండక్టర్లు నగరంలోని దిల్‌సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మేము పనిచేసే ఉద్యోగాలు వదిలిపెట్టి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా 52 రోజులు పనిచేశాం. పర్మినెంట్ అయ్యే అవకాశం ఉందని, ఆర్టీసీలో మాకు ఉద్యోగం లభిస్తుందనే ఆశతో పనిచేశాం. కానీ, చివరికి మమ్మల్ని నిర్దాక్షిణ్నంగా తొలగించారు. కేసీఆర్ ఇప్పటి వరకు తాత్కాలిక ఉద్యోగుల గురించి స్పందించకపోవడం బాధాకరం’ అని ఆవేదన వ్యక్తంచేశారు.