ఐదేళ్లలో పది లక్షల కోట్లు రుణమాఫీ.. ఆర్బీఐ నివేదిక వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

ఐదేళ్లలో పది లక్షల కోట్లు రుణమాఫీ.. ఆర్బీఐ నివేదిక వెల్లడి

November 21, 2022

దేశంలో బ్యాంకులు ఐదేళ్లలో ఎంత రుణాన్ని మాఫీ చేశాయో ఆర్బీఐ నివేదిక అధికారికంగా వెల్లడించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కలిపి మొత్తం 10 లక్షల 9 వేల 590 కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయని తెలిపింది. డాలర్లలో చూస్తే ఈ మొత్తం 123.86 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇచ్చిన రుణాల్లో కేవలం 13 శాతం మాత్రమే బ్యాంకులు వసూలు చేశాయి. అంటే 1 లక్షా 32 వేల 36 కోట్లు రికవరీ చేశాయి. సమాచార హక్కు చట్టం కింద ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ సమాచారం కోరగా, ఆర్బీఐ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విలువ తగ్గుదలకు ఈ మాఫీనే కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులే 70 శాతానికి పైగా మాఫీ చేశాయని వివరించింది. అయితే ఏ బ్యాంకు ఎంత మాఫీ చేసిందనే విషయాన్ని తెలపలేదు.

ఇంకో ముఖ్యమైన విషయం రుణాలు తీసుకున్న వ్యక్తుల వివరాలు బహిర్గతం చేయకపోవడం. మూడు నెలలకు పైగా రుణం చెల్లించకపోతే వాటిని బ్యాంకులు రైట్ ఆఫ్ చేసి నిరర్ధక ఆస్తులుగా ప్రకటిస్తాయి. వాటి మొత్తం విలువ ప్రతీఏటా పేర్కొంటుండడంతో బ్యాంకులకు ఇబ్బందిగా మారుతుంది. దీంతో వాటిని వ్యూహాత్మకంగా లెక్క నుంచి తప్పిస్తారు.