Ten percent reservation for tribals in Telangana: CM KCR
mictv telugu

కేసీఆర్ సంచలనం.. ఎస్టీలకు 10% రిజర్వేషన్లు.. కుటుంబానికి పది లక్షలు

September 17, 2022

Ten percent reservation for tribals in Telangana: CM KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం సంచలన విషయాలు వెల్లడించారు. గిరిజనులకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పది శాతం పెంచుతామని ప్రకటించారు. అలాగే దళిత బంధు లాగా గిరిజన బంధు అమలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో గిరిజనుల చిరకాల వాంఛ నెరవేరినట్టయింది. ఆదివాసీ, బంజారా భవన్‌లను ప్రారంభించిన కేసీఆర్.. తర్వాత నిర్వహించిన తెలంగాణ బంజారా, ఆదివాసీల ఆత్మీయసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో 6 శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందారు.

దీనిని పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడేళ్ల కింద కేంద్రానికి పంపాం. కానీ, వారు పట్టించుకోలేదు. కావాలనే తొక్కిపెడుతున్నారు. ప్రధాని మోదీని చేతులు జోడించి వేడుకుంటున్నా. రాష్ట్రపతి ముద్ర కొట్టించి పంపిస్తే మేం జీవో విడుదల చేస్తాం. ఇది న్యాయంగా మాకు రావాల్సిన హక్కు. వారిని అడిగి విసిగిపోయాను. వారం రోజుల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల జీవోను అమలు చేస్తాం. ఈ జీవోను గౌరవించి అమలు చేస్తారా? లేదా ఉరితాడు వేసుకుంటారా? అనేది మోదీ ఇష్టం. పది శాతం రిజర్వేషన్లను రాష్ట్రం అమలు చేసుకుంటుంది. అలాగే భూమి లేని గిరిజన పేదలకు గిరిజన బంధు అమలు ఇస్తాం. ఆర్ధిక వెసులుబాటు చూసుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. గిరిజన బాలికలకు గురుకులాలను త్వరలోనే పెంచుతాం. గిరిజన పండుగలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నాం. సంపదను పెంచి ప్రజలకు పంచాలనే సిద్ధాంతంతో టీఆర్ఎస్ పనిచేస్తోంది. కానీ, బీజేపీ మాత్రం ఎన్‌పీఏల పేరుతో లక్షల కోట్ల రూపాయలను దోచి పెడుతోంది. తెలంగాణను చూసి అనేక రాష్ట్రాలు ప్రభావితమవుతున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మత చిచ్చు పెట్టాలనే పార్టీల ఆగడాలు సాగనీయవద్దు. మన సమాజం అంతా ఐక్యంగా ఉండాలి. అణచివేతకు గురైన జాతుల కోసం జీవితాన్నే ధారపోసిన మహానుభావుడు అంబేద్కర్‌ను సముచితంగా గౌరవిస్తూ నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నాం. అందరూ అందరినీ గౌరవించుకుంటూ శాంతి సామరస్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా’నని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.