బాలయ్య జన్మదిన వేడుకల్లో ఉద్రిక్తత.. అన్న క్యాంటీన్ ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య జన్మదిన వేడుకల్లో ఉద్రిక్తత.. అన్న క్యాంటీన్ ధ్వంసం

June 10, 2022

తమ పార్టీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుందామనుకున్న టీడీపీ కార్యకర్తలను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. వారిని హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలయ్య జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలో అన్న క్యాంటిన్లను ప్రారంభించాలని టీడీపీ నాయకులు భావించారు. ఇందుకోసం అన్న క్యాంటీన్‌ షెడ్‌ను నెలకొల్పారు. దీనిని పోలీసులు ,మున్సిపల్‌ సిబ్బంది రాత్రికి రాత్రే బుల్‌డోజర్ల సహాయంతో వాటిని ధ్వంసం చేశారు.

మున్సిపల్‌ సిబ్బంది వైఖరిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటిన్‌ను తొలగించినప్పటికీ అన్నదానం చేయాలని ప్రయత్నిస్తున్న కృష్ణా-గుంటూరు జిల్లా టీడీపీ నాయకులను శుక్రవారం ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు మంగళగిరి బస్టాండ్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేదల ఆకలి తీరుస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందని విమర్శించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పరిమితికి లోబడి కార్యక్రమం చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు.