రాకేశ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత.. BSNL ఆఫీసుపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

రాకేశ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత.. BSNL ఆఫీసుపై దాడి

June 18, 2022

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో ఆందోళనలో పాల్గొన్న రాకేశ్ పోలీసుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. దాంతో మ‌ృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా దారిలో వరంగల్ పోచం మైదాన్ కూడలిలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసు కనిపించడంతో ఆందోళనకారులు దానిపై రాళ్లు రువ్వారు. నల్లజెండాలతో ప్రధాని మోదీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఎస్ఎన్ఎల్ బోర్డుకు నిప్పు పెట్టారు. ఆఫీసుకు కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు రాకేశ్ మృతదేహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖానాపూర్ మండలంలోని రాకేశ్ స్వగ్రామమైన దబీర్ పేటలో అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా, అంతిమయాత్రలో టీఆర్ఎస్ జెండాలు కనిపించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాకేశ్ మరణాన్ని టీఆర్ఎస్ రాజకీయాలకు వాడుకుంటోందని విమర్శించారు.