Tension at the house of BJP MP Arvind.. TRS workers entered the house
mictv telugu

బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిముందు ఉద్రిక్తత..

November 18, 2022

టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఎంపీ అరవింద్‌ ఇంటి ముందు దిష్టి బొమ్మను తగులబెట్టి నిరసన చేపట్టారు. ఇంట్లోకి చొరబడి, ఇంటి అద్దాలు ధ్వంసం చేసి, ఎంపీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇంటి గేటును మూసి వేసినా.. గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు. వారిని పోలీసులు పట్టికుని కిందికి దించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

ఎమ్మెల్సీ కవితతో బీజేపీ సంప్రదింపులు జరిపిందన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను ఎంపీ అరవింద్ ఖండించిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాంలో చిక్కుకున్న కవితతో సంప్రదింపులు జరపాల్సిన కర్మ బీజేపీకి పట్టలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో కవిత సంప్రదింపులు జరిపిందన్నారు. ఇక, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చే సమయంలో కవితను పిలవలేదన్నారు. దీంతో.. కేసీఆర్‌ను బెదిరించటానికే కవిత కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కు 20సీట్లకు మించి రావన్నారు.