ఆదిలాబాద్ పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వినాయక చౌక్‌లో వినాయక విగ్రహానికి బదులుగా క్లాక్ టవర్, దానిపై గ్లోబ్ నిర్మాణం చేయడంపై హిందూ సంఘాలు ఆందోళన, రాస్తారోకో నిర్వహించాయి. బుధవారం పెద్ద ఎత్తున చేరుకున్న హిందూ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, బీజేపీ నాయకులు, యువకులు చౌరస్తాకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం మానవహారంలా ఏర్పడి ట్రాఫిక్ అంతరాయం కల్గించారు. విషయం తెలుసుకున్న కమిషనర్ శైలజ సంఘటనా స్థలానికి చేరుకొని సముదాయించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అనంతరం కొందరు యువకులు క్లాక్ టవర్ ఎక్కి వినాయక విగ్రహాన్ని పెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పైకెక్కిన యువకులు కిందకు దిగగా, పోలీసులు అత్యుత్సాహంతో వారిని పట్టుకొని చితకబాదారు. దీనిని హిందూ సంఘాలు అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం వాతావరణం నెలకొంది. అనంతరం యువకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.