గుడివాడలో ఉద్రిక్తత.. అధికారిపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

గుడివాడలో ఉద్రిక్తత.. అధికారిపై దాడి

April 23, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్ట్ జాస్తి అరవింద్ అనే ప్రభుత్వ అధికారి  అక్రమంగా మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు అతనిపై మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు వీరంగం సృష్టించారు. కొంతమంది అధికార పార్టీ నేతలతో కలిసి ఆస్ట్ జాస్తి అరవింద్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో.. తొలుత జేసీబీని పక్కకు నెట్టి, ఆ తర్వాత గొంతు నొక్కి, ముఖంపై చేతులతో దాడి చేసి, చొక్కాను చింపేశారు. అంతేకాకుండా మెడలోని బంగారు గొలుసుని తెంచేశారు.

గుడివాడ మండలంలో మట్టి మాఫియా ఆగడాలు ఆగటం లేదు. పలువురు ప్రశ్నించటం మొదలుపెట్టడంతో దౌర్జన్యాలు చేయటం, అవసరమైతే వారిని చితక్కొట్టడం వంటివి చేస్తున్నారు. జగనన్న లేఅవుట్ల పేరుతో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు కొందరు అతని పేరు చెప్పి చెరువులు, పంట బోదెల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ, మట్టిని భారీ ఎత్తున గుడివాడ పట్టణానికి తరలిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి గుడివాడ మండలం మోటూరులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. అయితే, తహసీల్దారు ఆదేశాల మేరకు.. గుడివాడ అర్బన్ ఆస్ట్ జాస్తి అరవింద్ అక్కడికి చేరుకొని, వైసీపీ నాయకులను అడ్డుకున్నాడు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు అందిందని ట్రాక్టర్ల తాళాలు తీసుకున్నారు. దీంతో అక్కడి వ్యక్తులు కొందరు తమ నాయకుడి నుంచి మాకు ఫోన్ వచ్చిందని మళ్లీ జేసీబీతో పనులు ప్రారంభించారు. అంతలోనే అక్కడికి మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు, గంటా సురేష్ తమ్ముడు లక్ష్మణరావు, రాధాకృష్ణ ఆర్‌ అరవిందను చంపుతామంటూ అతడిపై భౌతిక దాడికి దిగారు.