విజయవాడలో టెన్షన్.. మొత్తం పోలీసుల గుప్పిట్లో - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో టెన్షన్.. మొత్తం పోలీసుల గుప్పిట్లో

April 25, 2022

విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ, సోమవారం యూటీఎఫ్ సంఘాలు ‘చలో సీఎంవో’ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు అప్రమత్తమైయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విజయవాడ పూర్తిగా పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది.

సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధిపై పోలీసులు భారీగా మోహరించారు. ఐడీ కార్డులు చూపించాలని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, దీంతో సమయానికి కార్యాలయాలకు, పనులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. పోలీసుల తీరుపై వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో పాటు తాడేపల్లి వైపు వెళ్లే అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న ప్రయాణికుల సెల్ ఫోన్లను తీసుకొని ఉద్యోగుల వాట్సప్ గ్రూపులతో సభ్యులుగా ఉన్నారా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఉద్యోగిగా నిర్ధరణ అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. వారధి నుంచి కాజా టోల్ గేట్ మధ్య ఎక్కడా ఆపొద్దని ఆర్టీసీ బస్సుల డ్రైవర్లకు ఆదేశాలిస్తున్నారు. రోబో పార్టీ స్పెషల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉద్యోగ సంఘాల ‘చలో విజయవాడ సందర్భంగా ఉద్యోగులు వివిధ జిల్లాల నుంచి పోలీసుల కళ్లుగప్పి మారువేషాల్లో వచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులూ మారువేషాల్లో వస్తారేమో అన్న అనుమానంతో బస్సులు,  రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.