వరంగల్ నగరం మిల్స్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అన్నదమ్ములు ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన బాధితురాలి కుటుంబసభ్యులు వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వారి కథనం ప్రకారం.. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై (15) ఆమె ఇంటి సమీపంలో ఉండే అన్నదమ్ములు అజ్మల్ అలీ (26), అబూ (22)లు గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటపడడంతో తల్లిదండ్రులు నిందితుల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. వారి ఇంటి ముందు ఉన్న బైకులను ధ్వంసం చేశారు. స్పందించిన వరంగల్ ఏసీపీ గిరికుమార్, మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని సంప్రదించి ఫిర్యాదు నమోదు చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.