కదం తొక్కిన సినీ కార్మికులు.. ఫిలిం ఫెడరేషన్‌ వద్ద ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

కదం తొక్కిన సినీ కార్మికులు.. ఫిలిం ఫెడరేషన్‌ వద్ద ఉద్రిక్తత

June 22, 2022

తెలుగు సినీ కార్మికులు నేడు కదం తొక్కారు. బుధవారం రోజు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, ఆందోళన చేపట్టారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఆందోళనలో వివిధ యూనియన్లకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో పలువురు యూనియన్ల అధ్యక్షులు మాట్లాడుతూ..”నాలుగేళ్ళుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదు. దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం భారం అవుతోంది. ఇప్పుడున్న వేతనాల్లో 30 శాతం పెరుగుదల ఉంటే తప్ప మా సమస్యలు పరిష్కారం కావు. ప్రతి మూడేళ్లకు ఒక్కసారి కార్మికుల వేతనాలు పెంచాలి. నాలుగేళ్లు దాటినా కూడా వేతనాల ఊసే లేదు. ఈరోజు సినీ పెద్దలు వేతనాల విషయంలో 30 శాతం పెంచితే గాని, షూటింగులకు వెళ్లాం” అని అన్నారు.

 

మరోపక్క కాసేపట్లో 24 క్రాఫ్ట్స్‌ సభ్యుల సమావేశం జరగునుంది. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్‌ ఆఫీస్‌ ముందు భారీగా పోలీసులు మొహరించారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాత్రమే ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. కార్మికులెవరు గుమిగూడవద్దని హెచ్చిరించారు.

సినీ కార్మికులు వేతనాల పెంపుపై నటుడు నరేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో నరేష్ మాట్లాడుతూ..”కరోనా కారణంగా మూడేళ్ల నుంచి చిత్రపరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోంది. ఇలాంటి సమయంలో సమ్మెబాట పట్టడం సరైన పద్ధతి కాదు.” అని ఆయన అన్నారు.