ఏపీలో పదో తరగతి పరీక్షపేపర్ లీక్..12 మంది అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో పదో తరగతి పరీక్షపేపర్ లీక్..12 మంది అరెస్ట్

April 28, 2022

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మొదలైన రోజు నుంచి పరీక్షపేపర్లు లీక్‌‌ అవుతుండడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి హైస్కూల్‌లో బుధవారం జరిగిన పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన సూత్రధారి రాజేశ్‌తో పాటు మరో 11మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు.

నంద్యాల కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ”పరీక్షల డ్యూటీకి హాజరై, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ప్రధాన వ్యక్తి రాజేశ్. పరీక్ష ప్రారంభమైన వెంటనే అతని మొబైల్‌లో పరీక్ష పత్రాన్ని ఫొటోలు తీసి, 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేశాడు. ఈ విషయం నాకు తెలవడంతో వెంటనే డీఈవో, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చాను” అని జిల్లా కలెక్టర్ అన్నారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నాగరాజు, నీలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్ట, రంగనాయకులు అనే టీచర్లు ఉన్నారు. పరీక్షల సమయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా, బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్టుమెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురిని సస్పెండ్ చేశారు. ఇకనుంచి జరగబోమే మిగతా పరీక్షల విషయంలో కఠినమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలీసు అధికారులను కోరారు.