మరికొద్ది రోజుల్లో కీలకమైన పరీక్షలు పెట్టుకుని పదవ తరగతి విద్యార్ధులు చేసిన మందు పార్టీ స్థానికంగా సంచలనంగా మారింది. గత ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళితే.. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి బీసీ బాయ్స్ హాస్టల్ పదో తరగతి విద్యార్ధులు కింది తరగతి విద్యార్ధులతో సరదాగా పార్టీ చేసుకుందామని భావించారు. అందుకు వార్డెన్‌ను అనుమతి కోసం అడుగగా, ఆయన సరేనని చెప్పడమేకాక, అందుకోసం చికెన్ వండించాడు. విద్యార్థులు తిన్నంత వరకు వార్డెన్ అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్లిపోయాడు. ఇదే అదనుగా భావించిన విద్యార్ధులు వార్డెన్ వెళ్లిపోయాక రెచ్చిపోయారు. బయటి విద్యార్ధులతో బీర్లు తెప్పించుకొని ఎంజాయ్ చేశారు. అంతేకాక, అత్యుత్సాహంతో సెల్ఫీలు, ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ అధికారి భాగ్యమతి హాస్టల్‌కు వచ్చి విద్యార్ధులను విచారించారు. నిజమేనని తేలడంతో తల్లిదండ్రులను పిలిపించి వారి ముందు కౌన్సిలింగ్ ఇప్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్ధులను మందలించినట్టు తెలిపారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్‌పై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.