శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

April 12, 2022

13

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు. ఇద్దరు కాదు. ఏకంగా ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువా సమీపంలో సాంకేతిక సమస్య వల్ల గౌహతి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. అయితే, రైలు నిలిచిపోవడంతో కొంతమంది ప్రయాణీకులు కిందకు దిగారు. అదే సమయంలో మరో ట్రాక్‌పై నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కిందకు దిగిన ప్రయాణీకులను ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో అక్కడున్న పలువురు చెల్లాచెదురయ్యారు.

ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారిని అదే రైలులో శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లి, సహాయక చర్యలు చేపట్టాలని ఆర్డీవో, తహసీల్దార్‌ను ఆదేశించారు. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రమాద స్థలానికి అంబులెన్స్‌ను పంపించారు. మృతుల్లో ఇద్దరు అసోం వాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ మృతి చెందిన వారిని చూసిన ప్రజలు కన్నీరు మున్నీరు అయ్యారు.