Terrible Fire Accident At Trichy Star Hotel, Tamilnadu
mictv telugu

స్టార్ హోటల్లో అగ్గి.. 40 గదులు బూడిద…

May 12, 2022

Terrible Fire Accident At Trichy Star Hotel, Tamilnadu

వేసవికాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అప్రమత్తంగా వ్యవహరిస్తే తప్ప జరిగే ప్రమాదాల నుంచి బయటపడలేం. నిన్న(బుధవారం) రాత్రి ఓ ప్రైవేట్ స్టార్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా భారీ నష్టం జరిగింది. విలువైన పత్రాలు కాలి బూడదయ్యాయి. ఈ ప్రమాదం తమిళనాడు తిరుచ్చి టౌన్ లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.30 గం.ల ప్రాంతంలో ఆ స్టార్ హోటల్‌ నాలుగో అంతస్థులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. నిమిషాల్లోనే మంటలు మిగతా అంతస్థులకు కూడా వ్యాపించి హోటల్‌లో ఉన్న 40 గదులు మొత్తం మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

అగ్ని ప్రమాదం జరిగిన హోటల్ నాలుగో అంతస్తులో అకౌంట్స్ విభాగం ఉంది. మంటల్లో అక్కడున్న డాక్యుమెంట్స్, ఫర్నీచర్ అంతా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 20 మంది ఫైర్ సిబ్బంది 4 ఫైరింజన్ల సాయంతో కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.