ఏపీలో ఘోర ఘటన.. సీఐ, ఎస్సై సస్పెండ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఘోర ఘటన.. సీఐ, ఎస్సై సస్పెండ్

April 22, 2022

006

ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం జరిగింది. 30 గంటలపాటు ఓ 23 ఏళ్ల మానసిక వికలాంగురాలపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డి నరకం చూపించిన సంఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన 23 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఈనెల 19వ తేదీ రాత్రి ఆమె ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా, అదే ప్రాంతానికి చెందిన దారా శ్రీకాంత్ (26) ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు.

అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని పెస్ట్ కంట్రోల్ విభాగంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే శ్రీకాంత్ విధులకెళ్లే సమయంలో తనతోపాటు ఆ యువతిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పెస్ట్ కంట్రోల్ విభాగానికి కేటాయించిన ఇరుకు గదిలో ఆమెను ఆ రాత్రంతా బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు 20వ తేదీ ఉదయం ఆసుపత్రిలోనే ఆమెను వదిలేసి, తాను ఇంటికెళ్లిపోయాడు. బయటికి ఎలా వెళ్లాలో తెలియక ఆ ప్రాంగణంలోనే అయోమయంగా తిరుగుతున్న ఆమెపై ఆసుపత్రిలో పనిచేసే ఒప్పంద కార్మికుడు చెన్న బాబురావు (23), అతని స్నేహితుడు జోరంగుల పవన్ కల్యాణ్ (23) కన్ను వేశారు. వారిద్దరూ ఆమెను మరోమారు ఇరుకుగదిలో నిర్బంధించి అత్యాచారానికి తెగబడ్డారు.

అయితే, ఇంటి వద్దనున్న తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లారు. దీంతో అక్కడి పోలీసులు స్పందించకుండా సాయంత్రం రావాలంటూ తిప్పి పంపించేశారు. చివరిసారిగా ఫలానా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని ఆధారమిచ్చినా చర్యలు చేపట్టలేదు. బాధితురాలు ఎక్కడుందో తెలిసినా.. ఆమెను రక్షించటానికి పోలీసులు వెళ్లలేదు. బాధితురాలి కుటుంబ సభ్యులే అక్కడికి వెళ్లి, తమ బిడ్డను కాపాడుకున్నారు. అప్పటికీ బాధిత యువతిపై లైంగిక దాడి జరుగుతుండటం పోలీసుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. పోలీసులు సత్వరం స్పందించి ఉంటే ఈ స్థాయి ఘోరం కొనసాగి ఉండేది కాదు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పోలీసులపై చర్యలు చేపట్టింది. సీఐ, సెక్టార్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు నున్న పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లినా, స్పందించకుండా సాయంత్రం రావాలంటూ తిప్పి పంపించేయటంపై తీవ్రంగా మండిపడింది. సీఐ హనీష్, ఎస్సై శ్రీనివాసరావును విజయవాడ సీపీ కాంతిరాణా టాటా విధుల నుంచి సస్పెండ్ చేశారు.