అసెంబ్లీ గేటుపై ఉగ్రవాదుల జెండా.. - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీ గేటుపై ఉగ్రవాదుల జెండా..

May 9, 2022

ఖలిస్తాన్ పేరిట ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్న ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు తెగబడ్డారు. ఏకంగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గేటుమీదే తమ జెండాలను ఎగురవేశారు. పోలీసులు గమనించి వాటిని వెంటనే తొలగించారు. పంజాబ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తూ పంజాబ్‌కు చెందిన పౌరులెవరైనా ఉన్నారా అని సెర్చ్ చేస్తున్నారు. సరిహద్దులను మూసివేసి రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు నిషేధిత సిఖ్ ఫర్ జస్టిస్ ఫోరం (ఎస్‌జెఎఫ్) సంస్థ జూన్ 6న రెఫరెండం నిర్వహిస్తామని పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఆదేశాలు జారీ చేశారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని ట్వీట్ చేశారు. కాగా, ఈ చర్య గురించి ఇంటెలిజెన్స్ విభాగం ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. ఏప్రిల్ 26న ఇటువంటి ఘటన జరిగే అవకాశముందని హెచ్చరించగా, భద్రత భారీగా ఉండడంతో సాధ్యపడలేదు. ఇదిలా ఉండగా, ఇటీవలే పాక్ నుంచి ఆయుధాలను అక్రమంగా తెలంగాణలోని ఆదిలాబాదుకు తరలించే క్రమంలో నలుగురు సిక్కు తీవ్రవాదులను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఖలిస్తాన్ డిమాండ్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.