తుర్కియే, సిరియాల్లోని భూకంపం మామూలు ప్రకంపనలు సృష్టించలేదు. రెండు చోట్లా అతలాకుతలం చేసి పడేసింది. ఇప్పటికి వేలాదిమంది చనిపోయారు. ఇంకా శిథిలాల కింద చాలా మంది ఉండొచ్చని అంచనా. అసలే ఎవరున్నారో ఎవరు చనిపోయారో తెలుసుకోలేక ఏడుస్తుంటే మరోవైపు కష్టపడి పట్టుకున్న ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది పారిపోయారు.
నైరుతి సిరియాలో రాజో ప్రాంతంలో మిలటరీ పోలీస్ జైలు ఉంది. అక్కడ 2వేల మంది ఖైదీలు ఉన్నారు. అందులో దాదాపు 1300 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలకు చెందినవారే. భూకంపంలో ఈ జైలు కూడా కూలిపోయింది. కరెక్ట్ గా అదే టైమ్ లో ఖైదీలు ప్రొటెస్ట్ కూడా చేశారుట. దీన్ని అదనుగా తీసుకుని అందులో 20 మంది తప్పించుకుని పారిపోయారు. వాళ్ళందరూ జిహాదీలేనని జైలు అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే జిహాదీలను విడిపించేందుకు సిరియాలో మరో ప్రదేశం రాఖాలో ఉన్న జైలుమీద దాడి జరిగింది. ఇప్పడు వీళ్ళు పారిపోయారు.
ఇక తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికి 5వేల మంది చనిపోయారని లెక్కలు చెబుతున్నారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద వేల మంది ఉండొచ్చని అధికారులు అంటున్నారు. ఈ సంఖ్య 20వేలకు మించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.