కశ్మీర్లో ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు సాధారణ పౌరులపై దాడులకు తెగబడుతున్నారు. గురువారం సాయంత్రం సాధారణ కూలీలపై గ్రనేడ్ విసిరి ఒకరిని పొట్టన పెట్టుకున్నారు. పుల్వామాలోని గదూరా ప్రాంతంలో జరిగిన గ్రనేడ్ దాడిలో బీహార్‌కు చెందిన మహ్మద్ ముంతాజ్ మరణించగా, మహ్మద్ ఆరిఫ్, మహ్మద్ మజ్బూల్గా గుర్తించారు. వీరిని ఆసుపత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగా, ఆ పరిసర ప్రాంతంలోనే ఉగ్రవాదులు ఎక్కడో ఓ చోట దాక్కున్నారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల గడచిన సందర్భంగా ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కశ్మీర్లో ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందే ఉగ్రవాదులు బెదిరింపులకు దిగగా, నిఘా వర్గాల హెచ్చరికలతో బలగాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఉగ్రవాదులు రూటు మార్చి సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుంటుండడంతో రక్షణ దళాలు మరింత అప్రమత్తమయ్యాయి.