Tesla CEO Elon Musks' 'warning text' to Twitter CEO Parag Agrawal
mictv telugu

ట్విట్టర్ సీఈవోకు ఎలన్ మస్క్ వార్నింగ్ !

July 17, 2022

టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌, ట్విట్టర్‌ మధ్య వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఎలన్‌మస్క్‌ ఈ ఒప్పందం నుండి వైదొలగడానికి ముందు ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌కు ఓ వార్నింగ్ మెసేజ్‌ చేశారు. ట్విటర్ సంస్థను ఏవిధంగా కొనుగోలు చేయాలనుకుంటున్నారనే దానిపై ఆ సంస్థ న్యాయవాదులు తనను ఆరా తీస్తున్నారని, ఫైనాన్స్ ఎక్కడి నుంచి పొందుతున్నానని ప్రశ్నిస్తున్నారని, తద్వారా తనకు ఇబ్బంది కలుగజేస్తున్నట్లు, వెంటనే దాన్ని ఆపాలని పరాగ్ కు తెలిపారు మస్క్. దీన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు.

కొన్ని రోజుల క్రితం ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్ల కొనుగోలు చేసే ఒప్పందం నుండి మస్క్‌ వైదొలిగిన సంగతి విదితమే. దీంతో ట్విట్టర్‌… డెలావర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆయన ట్విట్టర్‌ను ఒప్పందం చేసుకున్న దాని ప్రకారమే కొనుగోలు చేసేలా, ఎటువంటి నిబంధనలకు ఉల్లంఘించకుండా చూడాలని పేర్కొంది. వీలైనంత త్వరగా విచారణ ప్రారంభించాలని కోరింది. ట్విట్టర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా మస్క్‌ న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. రెండు నెలల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని అభ్యర్థనను తోసిపుచ్చాలని పేర్కొన్నారు. నకిలీ అకౌంట్ల విషయాన్ని దాచిపెట్టేందుకు సత్వర విచారణ కోరుతుందని అన్నారు. నకిలీ, స్పామ్‌ ఖాతాలకు సంబంధించిన సాక్ష్యాలు లభించేందుకు కొంత సమయం పడుతుందని, కాబట్టి 2023 వరకు విచారణ చేపట్టవద్దని న్యాయవాది కోరారు.