ఆహా...ఎన్నాళ్లకు టెట్...టెంట్ వేశారు...గ్రేట్ సారూ... - MicTv.in - Telugu News
mictv telugu

ఆహా…ఎన్నాళ్లకు టెట్…టెంట్ వేశారు…గ్రేట్ సారూ…

June 7, 2017

టెట్ కోసం ముచ్చటగా మూడేళ్లు ఎదురు చూశారు. ఏడాదికి రెండు సార్లు కాదు..మూడేళ్లలో ఒక్కసారితోనే కానిచ్చేశారని అభ్యర్థులు తిట్టుకున్నారు.ఇక ఇప్పట్లో ఉండదు అనుకున్నారు..డీఎస్సీకి ముందు మళ్లీ ఒక్కసారైనా టెట్ వేయాలని వెయ్యినొక్కసార్లు వేడుకున్నారు. కానీ సర్కార్ కు ఇప్పుడు వినిపించినట్టు ఉంది.టెట్ టెంట్ లేపింది

డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. జులై 23న టెట్ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. జూన్ 10న టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందు మరోసారి టెట్ నిర్వహించాలని కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కోరారని.. వారి కోరిక మేరకే టెట్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి 26,100 మంది కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తి చేసుకున్నారని వెల్లడించారు.

జూన్ 13 నుంచి 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 17 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జులై 23న టెట్ పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ జరగనుంది. టెట్ ఫలితాలు ఆగస్టు 5న విడుదల చేస్తారు. టెట్ ఫలితాలు వచ్చిన వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది. టీఎస్పీఎస్సీ ద్వారా డీఎస్సీ పోస్టుల భర్తీ జరుగుతుంది. అన్ని పాఠశాలల కోసం 14 వేల 74 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కడియం తెలిపారు. వచ్చే ఏడాది గురుకులాల్లో మరో 6 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. మొత్తంగా ఈ ఏడాది, వచ్చే ఏడాది కలిపి దాదాపు 27 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 31 జిల్లాల ప్రతిపాదికన ఖాళీల వివరాలు సేకరించి, భర్తీ ప్రక్రియ చేపట్టామని కడియం చెప్పారు.
ఇన్నాళ్లకైనా కడియం సార్ కనికరించారు. అభ్యర్థులూ ఇక పుస్తకాల దుమ్ము దులపండి. టెట్ లో క్వాలిఫై కావడానికి ..టీచర్ పోస్టు కొట్టేయడానికి కుస్తీ పట్టండి..ఆల్ ది బెస్ట్..