అసహనం, అరాచకం.. కిషన్‌రెడ్డి వర్సెస్ కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

అసహనం, అరాచకం.. కిషన్‌రెడ్డి వర్సెస్ కేసీఆర్

March 13, 2018

అర్థం పర్థంలేని వితండ వాదాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావటంలేదని సీఎం కేసీఆర్ బీజేపీ నేత కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ ఎంపీలు లోక్‌సభలో స్పీకర్ ముఖంపై ప్లకార్డులను ఉంచుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై సీఎం ఘాటుగా స్పందించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై హెడ్‌‌ఫోన్ విసిరిన వ్యవహారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌‌ల శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడం తెలిసిందే. 11 మంది ఎమ్మెల్యేలతోపాటు మండలిలోనూ కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. దీనిపై కిషన్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు.  ‘సభలో నిన్న జరిగింది దురదృష్టకరం. సభలో గత నాలుగేళ్ళుగా ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరిస్తున్న జానారెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయటం సబబు కాదు. క్రమశిక్షణకు ఆయన మారుపేరు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు కూడా రభస చేస్తున్నారు ’ అని కిషన్ రెడ్డి  పేర్కొన్నారు. కేసీఆర్ స్పందిస్తూ ‘సంబంధంలేని విషయాల్లోకి పార్లమెంట్ ప్రస్తావన దేనికి తెస్తారు ? పార్లమెంట్‌లో ఎవరూ మైకులు విసిరేయడం లేదు, కాగితాలు చింపేయడం లేదు. జానారెడ్డి ఏం చేశారో మీకు తెలుసా? ఆయనంటే మాకు కూడా గౌరవం ఉంది. ఆయన్ను నేనే ముందుగా పెద్దలు అని సంబోధిచాననే విషయం మరవొద్దు. నిన్న జరిగిన ఘటనను మీరు సమర్థిస్తున్నారా ? సభ అంటే కేవలం మీరేనా..? మావైపు ఉన్న 90 మంది సభ్యులు కారా? అభిప్రాయాలు అడిగితే లేనివి కల్పించి చెప్పటం ఎందుకు ? సభలో లేని వారి గురించి ఏది పడితే అది ఎలా మాట్లాడగలుగుతారు? ఏది పడితే అది మాట్లాడితే అరాచకం అవుతుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డి ప్రతిస్పందిస్తూ.. ‘ సీఎంకు ఇంత అసహనం పనికిరాదు. నేను ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. పార్లమెంట్‌లో జరుగుతున్న సంఘటనలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పాను. ప్లకార్డులు ప్రదర్శించొద్దంటే.. పార్లమెంట్‌లో జరుగుతున్నాయని చెప్పాను. అది కూడా తప్పేనా..? పార్లమెంట్‌లో అలా జరగడం సరైందేనా..? ’ అన్నారు.

కేసీఆర్ బదులిస్తూ..‘సభ దానిపై ఒక నిర్ణయం తీసుకున్నది.. అయిపోయింది. శాసనసభలో జానారెడ్డి నిన్న క్రమశిక్షణతోనే మెలిగారు. గతంలో సభకు రాని వారిని కూడా సస్పెండ్ చేశారు. మేమెవరి దయాదాక్షిణ్యాల మీదా సభకు రాలేదు ’ అన్నారు.