ఫేస్‌బుక్‌ పిచ్చోడి వింత సవాల్

సోషల్ మీడియాలో పిచ్చి పీక్‌కు వెళుతుందనడానికి ఇది తాజా ఉదాహరణ. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ‘చాంపిగ్నే టోరినో’కు ఫేస్ బుక్ అంటే పిచ్చి. చిల్లరనేరాలు, ఆన్ లైన్ గిల్లికజ్జాలు అతని అలవాటు. ఫేస్‌బుక్‌ ద్వారా పోలీసులను  రెచ్చగొట్టేవాడు.  అతనిపై బోలెడు అరెస్ట్ వారంటున్నాయి. టోరినోను  పట్టుకోవడానికి పోలీసులు ఏళ్ల నుంచి  నానా యాతనా పడుతున్నారు. దీన్ని గమనించిన టోరినో వాళ్లకు వింత సవాలు విసిరాడు. రెడ్‌ఫోర్డ్‌ టౌన్‌షిప్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు పెట్టే పోస్టుకు వెయ్యి షేర్లు గనక వస్తే తనంత తానే వాళ్ల ముందు లొంగిపోతానని ప్రకటించాడు. లొంగిపోవడమే కాకుండా వాళ్లకు డజన్ డోనట్స్(తినుబండారాలు) కూడా ఉచితంగా సమర్పించుకుంటానని చెప్పాడు.  విషయం తెలుసుకున్న పోలీసులు దీన్ని నిజంగానే సవాలుగా తీసుకున్నారు.  నానా తిప్పలూ పడి తమ పోస్టుకు వెయ్యి షేర్లు వచ్చేలా చేసుకున్నారు. వాళ్లు ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్టుకు కేవలం గంట వ్యవధిలోనే వెయ్యి షేర్లు  వచ్చాయి. టోరినో మాట నిలబెట్టుకున్నాడు. పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయాడు.

SHARE