క‌విత‌కు నారీ ప్ర‌తిభా పుర‌స్కార్‌ - MicTv.in - Telugu News
mictv telugu

క‌విత‌కు నారీ ప్ర‌తిభా పుర‌స్కార్‌

August 24, 2017

ప్ర‌తిష్టాత్మక నారీ ప్ర‌తిభా పుర‌స్కార్ అవార్డును అందుకున్నారు నిజామాబాద్ ఎంపి క‌ల్వకుంట్ల  క‌విత‌. యువ‌త‌, మ‌హిళ‌ల సాధికార‌త కోసం కృషి చేసినందుకుగాను క‌విత‌ను కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మహిళా పారిశ్రామికవేత్తల సంఘం( విమెన్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ అసోసియేష‌న్..డ‌బ్ల్యూఇఎ) సంయుక్తంగా ఈ పుర‌స్కారానికి ఎంపిక చేశాయి. గురువారం హైద‌రాబాద్‌లో వీ ఇండియా చైర్మ‌న్ డాక్టర్ టి. వ‌సంత ల‌క్ష్మి.. కేంద్ర ప్రభుత్వం తరఫున  క‌విత‌కు అవార్డుతో పాటు ప్ర‌శంసా ప‌త్రాన్ని అంద‌జేసి, శాలువా క‌ప్పి స‌న్మానించారు.  

డిల్లీలో జ‌రిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ..ఎస్సారెస్పీ పునరుజ్జీవ స‌భ వల్ల క‌విత హాజ‌రుకాలేక పోయారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా ఆదేశాల‌తో వ‌సంత ల‌క్ష్మి హైద‌రాబాద్‌కు వ‌చ్చి…అవార్డును అంద‌జేశారు. మొద‌టిసారి ప్ర‌వేశ‌పెట్టిన నారీ ప్రతిభా పుర‌స్కార్ -2017 అవార్డును కవితతో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కల్పకం ఏచూరి, ఆషా ప్రకాశ, స్మృతి నాగపాల్, ప్రియా భార్గవ, షిర్లే అబ్రహం అవార్డును అందుకున్నారు.

వీరితో పాటు తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షి టీమ్స్ బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్ స్వాతి లక్రా కూడా అవార్డు అందుకోవడం తెలంగాణకు గర్వకారణం.

ఈ సంద‌ర్భంగా వ‌సంత‌ల‌క్ష్మి మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ద్వారా మ‌హిళ‌ల అభ్యున్న‌తికి విశేష‌కృషి చేస్తున్నార‌ని క‌విత‌ను ప్ర‌శంసించారు. అలాగే స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ల ద్వారా నిరుద్యోగ యువ‌తీయువ‌కుల‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇస్తూ..ఉద్యోగ‌, ఉపాధి క‌ల్ప‌న‌కు తోడ్ప‌డుతున్నార‌న్నారు.

అటు స‌మాజాన్ని చైత‌న్య ప‌రుస్తూనే…యువ‌త త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేలా చేసి, స‌మాజాన్ని చైత‌న్య ప‌ర్చడంలో ఐకాన్‌గా నిలిచార‌ని కవితను కొనియాడారు.